Heavy security in Munugode: మునుగోడు ఉపపోరులో గెలుపు కోసం రాజకీయ పార్టీలు మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులుగా వివిధ ప్రాంతాల్లో పోలీసుల సోదాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు నిఘా పెంచాయి.
ఉపఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ డబ్బు పంపిణీ, రవాణా మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. కళ్లెం వేసేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలోకి ప్రవేశించి అన్ని వాహనాలను అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజాను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలోనే టోల్ ప్లాజా వద్ద మంత్రి మల్లారెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు. ప్రముఖ సినీ నటుడు నాగబాబు కారులో సోదాలు నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కవాతు చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు రవాణా చేయకుండా సోదాలు చేస్తున్నామని ఏసీపీ ఉదయ్ కుమార్ వెల్లడించారు. ప్రచారంలో భాగంగా పార్టీల మధ్య గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శాంతి భద్రతలపైనా దృష్టిసారించామని.. 53 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మునుగోడు చుట్టు పక్కల ప్రాంతాలపైనా ప్రత్యేక నిఘా ఉంచినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: