Gutta Sukhender Reddy fire on bjp: దేశంలో అధికారంలో ఉన్న భాజపాకు మత పిచ్చి ముదిరి పోతోందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా పార్టీయే బలవంతంగా మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. భాజపా తన బల పరీక్షను పరీక్షించుకునేందుకే మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చిందన్నారు.
ఒకవైపు కేంద్రంలో ఉన్న మంత్రులంతా రోజుకో ఇద్దరు చొప్పున మునుగోడు చుట్టూ తిరుగుతున్నారన్నారని.. మునుగోడులో చాలా సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ మొదలైన సంస్థలు తమ చేతుల్లో ఉన్నాయనే ధీమాతో రాష్ట్రంలో దాడులు చేస్తూన్నారని ఆయన ఆరోపించారు.
కేసీఆర్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక, మరోవైపు ఈడీ, సీబీఐ దాడులతో నాయకులను బెదిరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం దేశం కోసం ఆలోచించి.. రాష్ట్రాల మీద పెత్తనాలు చేయడం తగ్గించుకోవాలని సూచించారు. భాజపా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన మునుగోడులో తెరాస పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
మునుగోడు ప్రజలు చాలా చైతన్య వంతులు.. మతకల్లోలాలు సృష్టించే పార్టీలను గెలిపించరని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ పడిపోతుందని.. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం భాజపా చేస్తుందని ఆరోపించారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
'అధికారంలో ఉన్న భాజపాకి మత పిచ్చి ముదిరిపోతోంది. భాజపా తన బల పరీక్షను పరీక్షించేందుకే మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చింది. మునుగోడులో భాజపా చాలా సొమ్ము దుర్వినియోగం చేస్తోంది. మునుగోడు ప్రజలు చాలా చైతన్య వంతులు.. మతకల్లోలాలు సృష్టించే పార్టీలను గెలిపించరు. భాజపా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన మునుగోడులో తెరాస పార్టీనే గెలుస్తుంది.'- గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్.
ఇవీ చదవండి: