నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాదారుల పాలయ్యాయి. కొన్ని దేవాలయాల్లో జాతరలు, ఉత్సవాలు నిర్వహించేందుకు విరాళాల పేరుతో దాతలపై ఆధారపడాల్సి వస్తోంది అంటే అతిశయోక్తి కాదేమో.
కబ్జాదారుల కబంధహస్తాల్లో రామయ్య భూములు
తిరుమలగిరి రామస్వామి గుట్టపై వెలసిన రామయ్యకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఉత్సవాలతో వెల్లివిరిసిన ఆలయం నేడు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవట్లేదు. స్వామి పేరు మీద 254 ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలో ఉంది. కౌలు చెల్లించే నాథుడు లేక కాసులతో విలసిల్లాల్సిన ఆలయం.. కబ్జాదారుల కబంధహస్తాల్లో విలవిల్లాడుతోంది. శ్రీరామనవమికి మాత్రం గ్రామంలోని కొద్దిమంది దగ్గర విరాశాల సేకరించి వేడుకలు జరుపుతున్నారు.
'ఎకరాని ఏడు వేలు చెల్లించండి.. పనైపోతుంది'
అక్రమంగా భూములను అనుభవిస్తున్న ఆక్రమణదారులు ఇటీవల ఓ అధికార పార్టీ నేతలను సంప్రదించినట్లు సమాచారం. ఆ నాయకునికి ఎకరాకు ఏడు వేలు చెల్లిస్తే.. ఆ భూములను వారి పేరు మీద పట్టా చేయిస్తానంటూ ఆయన నమ్మబలికాడు. ఆయనకూడా 30 ఎకరాల భూమిని సాగు చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు.
ప్రజావాణిలో వినతిపత్రం..
మొదట ఎకరాకు రూ. 200 చొప్పున తీసుకుని.. తర్వాత రూ. రెండు వేలు వసూలు చేశాడని.. ప్రస్తుతం ఎకరాకు మరో ఐదు వేలు ఇస్తే పని జరుగుతుందని కొత్త పథకం రచించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు వీటిపై దృష్టి సారించి దేవాదాయ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్