Former Students Who Studied At School Are Now Teachers: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పోతుల గోపాల్ సాంఘికశాస్త్రం, రామకృష్ణ జీవశాస్త్రం, యాట మధుసూదన్ రెడ్డి ఆంగ్లం, రవీందర్ తెలుగు, కోట మల్లయ్య గణితం బోధిస్తున్నారు. వీరంతా ఇదే పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు చదివారు. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తూ.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
Alumni are Working as Teachers in the School: వీరంతా పాఠాలు బోధించడంతోనే తమ పనిముగిసిందని భావించడం లేదు. చుదువుకున్న పాఠశాలకు తమ వంతుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం దాతల సహకారంతో పాటు.. వారు కూడా చందాలు వేసుకుని మెుత్తం మూడున్నర లక్షల రూపాయలతో ఆడిటోరియం నిర్మాణం, రూ.3 లక్షలతో తాగునీటి శుద్ధజల కేంద్రం, లక్షన్నర రూపాయలతో ఇతర పరికరాలు ఏర్పాటు చేశారు.
నేను ఉపాధ్యాయ వృత్తిలోకి 1998లో వచ్చాను. పుట్టిన ఊరు చదువుకున్న బడి, ఒక ఉపాధ్యాయునిగా పని చేస్తున్న క్రమం. నేను ఇదే పాఠశాలలో 1983 బ్యాచ్లో ఎస్ఎస్సీ చదివాను. 1998లో ఈ వృత్తిలోకి వచ్చినకా ఈ పాఠశాలకు రావాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను. ఒక అదృష్టంకా 2018 జూలై 9న నేను ఈ పాఠశాలకు ఉపాధ్యాయునిగా రావడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 2022 నుంచి నేను హెచ్ఎంగా పనిచేస్తున్నాను. -పోతుల గోపాల్, ప్రధానోపాధ్యాయులు
వారు చదువుకునే సమయంలో ఈ పాఠశాలలో తరగతికి 70 నుంచి 80 మందికి పైగా విద్యార్థులు ఉండేవారని.. ఆ సంఖ్య కాస్త పెరిగిందని ఆ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాల కన్నా.. ప్రభుత్వ పాఠశాల్లో ఎక్కువుగా చుదువుకుంటున్నారని తెలిపారు. ఈ ఐదుగురు ఉపాధ్యాయులు తమ వృత్తితో పాటు బాధ్యతను గుర్తు చేసుకుంటూ పని చేస్తున్నారు. పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులను తమకు చేతనైనంత చేస్తూ.. ఇంకా కావాల్సిన నగదు కోసం దాతల సహకారంతో పూర్తి చేస్తున్నారు.
ఇక్కడ నేను పనిచేయడం అనేది నా పూర్వ జన్మసుక్రుతంగా భావిస్తున్నాను. ఎందుకంటే.. ఇక్కడ నేను విద్యాబుద్ధులు నేర్చుకొని.. మంచి విద్యని అభ్యసించి సమాజానికి నేను ఎంతో కృషి చేయదలుచుకున్నాను. నేను పాఠశాలలో చదువుకుని ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని నా ఉద్దేశం. -గజ్జల రామకృష్ణ, ఉపాధ్యాయులు
ఇవీ చదవండి: