గంజాయికి బానిసలై దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన షేక్ ముఫజ్, హనుమాన్ పేటకు చెందిన గిలోజు సంజు, మరో ముగ్గురు మైనర్ బాలురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 12న రాత్రి పట్టణానికి చెందిన లింగంపల్లి రవికిరణ్, గోకుల్ కలిసి బైపాస్ రోడ్డు మార్గంలో సైకిల్పై ఇంటికి వెళ్తుండగా.. వీరిని కొందరు అడ్డగించి పక్కనే ఉన్న కంపచెట్లలోకి తీసుకెళ్లి రూ. 25 వేల నగదు, బంగారు గొలుసుతోపాటు రెండు సెల్ఫోన్లు తీసుకొని పరారయ్యారు. దీనిపై సీఐ శ్రీనివాస్రెడ్డి దోపిడీ కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం సభ్యులు రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం చిల్లాపురం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న బృందం సభ్యులు స్కూటీలపై వెళ్తున్న షేక్ ముఫజ్, గిలోజు సంజును అదుపులోకి తీసుకున్నారు. వీరి వాహనాలలో అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ జరుపగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్ బాలురు ఉండగా వారిని జువైనల్ కోర్టుకు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి: అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్