TS Ferro Alloys industries: ఇనుము ముడి సరుకుల్లో ఒకటైన ఫెర్రో సిలికాన్‌ను ఉత్పత్తి చేసే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలుండగా విద్యుత్ ఛార్జీల పెంపు, రాయితీల్లో కోతతో 7 పరిశ్రమలు మూతపడ్డాయి. సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లోని మూడింటిలో మాత్రమే నామమాత్రంగా ఉత్పత్తి జరుగుతోంది.
ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్‌లు తక్కువగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌కు 6, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 4 కంటే తక్కువగా వసూలు చేస్తున్నారు. ఐతే ఇతరపరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఫెర్రో అల్లాయిస్ రంగానికి రూ. 3 పెంచిందని పరిశ్రమవర్గాలు వాపోతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపు భారంగా మారడంతో పరిశ్రమను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని యజమానులు చెబుతున్నారు.
రోడ్డున పడ్డ కార్మికులు: ఇప్పటికే నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కేతేపల్లిలోని పరిశ్రమలు కాయిలాపడగా అయిటిపాముల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో నామమాత్రంగా ముడిసరుకు ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించేది. కరెంటు ఛార్జీలు తాళలేక కంపెనీలు మూతపడటంతో రోడ్డున పడ్డ కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.
బతుకుదెరువు కోసం కర్ణాటక, మహారాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లలో ఫెర్రో అల్లియిస్ రంగానికి విద్యుత్ టారిఫ్ మూడు రెట్లు పెరిగింది. 2012లో 2 రూపాయల 30 పైసలున్న యూనిట్ ధర 2016లో 5.35 కాగా, గతేడాది రూ. 8కు చేరింది. అధిక భాగం కరెంట్ బిల్లులకే చెల్లించాల్సి రావటంతో కంపెనీలకు నష్టాలొస్తున్నాయి.
గిరాకీ ఉన్నా ఉత్పత్తివ్యయం పెరగటంతో నష్టాలు భరించలేక యాజమాన్యాలు పరిశ్రమలను మూసేయాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త పరిశ్రమల మాదిరి తమకు కరెంట్ ఛార్జీలు తగ్గించి రాయితీలు ఇవ్వాలని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: