Farmers suffering with power cuts: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పన్నెండు రోజులుగా నీళ్లు లేక నెర్రలు చాస్తున్న పొలాలకు.. కరెంటు కోతలు తోడవ్వటంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 6 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్న నల్గొండ జిల్లాలోనే.. 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎలాంటి సమస్యలు రాకపోవటంతో రాష్ట్రమంతా అమలు చేశారు. అలాంటిది ఇప్పుడు అక్కడే కరెంటు కోతలు వేధిస్తున్నాయి. అప్రకటిత కోతలను నిరసిస్తూ.. నూతన్‌కల్ మండలంలో రైతులు ధర్నా చేయడం పరిస్థితికి అద్ధం పడుతోంది.
కొన్నాళ్లుగా వ్యవసాయ మోటార్లకు అధికారులు త్రీ ఫేస్ కరెంటును రాత్రిపూట ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల విడతల వారీగా ఇస్తున్నారు. ఫలితంగా కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. చాలా చోట్ల ఉదయం 4 నుంచి 10 గంటల మధ్యలో రెండు మూడు సార్లు అంతరాయంతో విద్యుత్ ఇస్తున్నారని రైతులు తెలిపారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కరెంటు వస్తుందని వెల్లడించారు. దాదాపు 8 గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. చాలాసేపు అంతరాయం కలుగుతోందని వెల్లడించారు. దీంతో పారిన మడిలోనే మళ్లీ నీళ్లు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు ఎండిపోయి నష్టపోతామని వాపోతున్నారు.
ప్రస్తుత సమయంలో అన్ని పొలాలకు తడులు అవసరం అవుతున్న కారణంగా విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు. ఫలితంగా కొన్నిచోట్ల సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించారు. వాటన్నింటినీ తక్షణం పరిష్కరించి బోరుబావులకు కరెంటు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది బోరుబావుల కింద గరిష్ఠ విస్తీర్ణంలో పంటల సాగు సైతం కోతలకు కారణమని అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి..