farmers suffered: ప్రభుత్వ సూచన మేరకు సన్నరకం పండించినా మిల్లర్లు సిండికేట్‌గా మారి కొర్రీలు పెడుతూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. నల్గొండ జిల్లాలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో రైతులు బారులు తీరుతున్నారు. మిల్లర్ల ధరలు మింగుడుపడక అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులకు పంట పండించడం ఒక ఎత్తైతే దానిని అమ్ముకోవటం కత్తిమీద సాములాగా మారింది.
ప్రభుత్వ సూచనతో సన్న రకం ధాన్యాన్ని పండించినా మిల్లర్ల ధరలు చూసి రైతులు అవాక్కవుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు మిర్యాలగూడలో వరి ధాన్యంతో మిల్లుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రకరకాల కారణాలు చెబుతూ మిల్లర్లు అరకొర ధర చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర అడిగితే ఏదో ఒక సాకుతో కొనుగోలు చేయకుండా పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
ప్రతిసారి దొడ్డు రకం సాగు చేసే రైతులు ఈసారి సన్న రకం సాగు చేయటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మిల్లర్లు తెలిపారు. ధాన్యం కొనకుండా మద్దతు ధర చెల్లించకుండా తూకంలో మోసాలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించటం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: తరుగు పేరుతో ధాన్యంలో కోత పెట్టొద్దు: మంత్రి గంగుల