నల్గొండ జిల్లా తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్లో పోసిన ధాన్యం తడవడం వల్ల రంగుమారిందని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోళ్లు ప్రారంభించి వారమైనా.. సరిగ్గా కాంటాలు పెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంట సాగు చేయకుండా.. ధాన్యం రాశుల చుట్టూ తిరగడమే సరిపోతుందని వాపోయారు. రెండ్రోజుల నుంచి మబ్బు పట్టడం వల్ల ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నాణ్యతను బట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.