పోడు భూములను సాగుచేసుకుంటూ... జీవనం సాగిస్తున్న నల్గొండ జిల్లాలోని గిరిజనులు... పట్టాల కోసం ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఎట్టకేలకు వారి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని ఈనెల 10న జరిగిన హాలియా బహిరంగసభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సీఎం ఆదేశాల మేరకు...
సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్... మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎస్ సోమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలో అధికార యంత్రాంగం గ్రామాల పర్యటనకు బయలుదేరింది.
నోటిఫై ప్రతులు...
తిరుమలగిరి మండలంలో ఇప్పటికే సదరు భూములను గుర్తించిన అధికారులు... నోటిఫై ప్రతుల్ని జిల్లా అదనపు కలెక్టర్ల సమక్షంలో గ్రామపంచాయతీ కార్యాలయాలకు అతికించారు. మండలంలోని నెల్లికల్, చింతలపాలెం, తునికినూతల గ్రామాల్లోనే... ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు తేల్చారు. మండలంలోని 5 గ్రామాల్లోనే గతంలో అధికంగా పట్టా పాసుపుస్తకాలు నమోదై ఉన్నాయి. ఉన్నది వంద ఎకరాలైతే 150 ఎకరాలకు పాసు పుస్తకాలుండటంతో... వాటిని పట్టాదారుల పేరిట కాకుండా వివాదాస్పదమైనవిగా పేర్కొంటూ అధికారులు 'పార్ట్-బీ'లో చేర్చారు.
రైతుల హర్షం...
ఈ 5 గ్రామాల పరిధిలో 3,400 ఎకరాల పోడుభూములు గుర్తించగా... అందులో 2,400 ఎకరాలు చింతలపాలెం గ్రామంలోనే ఉన్నాయి. నెల్లికల్‌లో 415 ఎకరాలు, తునికినూతనలో 108 ఎకరాల పోడుభూమి ఉన్నట్లు తేల్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండ్రోజుల్లో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలన్న తలంపుతో... భూముల్ని గుర్తించే పనిని వేగవంతం చేశారు. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న తమ కల సాకారమవుతుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంజాయ్మెంట్ సర్వే...
ఏ భూమిలో ఎవరు కాస్తులో ఉన్నారని నిర్ధరించే ఎంజాయ్మెంట్ సర్వేను ఇప్పటికే చేపట్టిన అధికారులు... రెండ్రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అర్హత గల భూములన్నింటిని గుర్తించి వాటికి వెంటనే పట్టాలు జారీ చేయనున్నారు. ముందుగా 2,400 ఎకరాలకు పాసు పుస్తకాలు జారీ చేశాక... మిగతా వెయ్యి ఎకరాలపై దృష్టి సారించే అవకాశముంది. ఎన్నికల వేళ హడావుడి చేసి తర్వాత మరుగున పడేయవద్దని ప్రజలు కోరుతున్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినందున.... అర్హులందరికీ పట్టాలు అందిస్తే... జిల్లాలో 17 వందల మంది పేద రైతులకు లబ్ధి చేకూరనుంది.
- ఇదీ చూడండి : దేశంలో మరో 12,194 మందికి వైరస్