వరుస కేసులతో నల్గొండ.. విపరీతమైన ప్రాథమిక కాంటాక్టులతో సూర్యాపేట.. తిరిగివచ్చిన వలస కూలీలతో యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొవిడ్ కేసులు వెలుగుచూస్తుండటం పట్ల వైద్యశాఖలో అలజడి మళ్లీ మొదలైంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు క్రమంగా డిశ్చార్జి అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నాలుగు నెలల చిన్నారి కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
నాలుగు నెలల చిన్నారి మృతి
సూర్యాపేట మండల పరిధి గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ చిన్నారి తల్లికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. బాలుడికి ఎక్కడ వైరస్ అంటుకుందనేది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించిన సమయంలో... అక్కడే వైరస్ సోకినట్లు సూర్యాపేట జిల్లా అధికారులు భావిస్తున్నారు.
వైరస్ ఎలా సోకింది..?
ఆత్మకూరు(ఎస్) మండలంలోని గ్రామంలో చిన్నారితోపాటు తల్లి చాలా రోజుల ఉన్నారు. ఆగ్రామంలో ఇప్పటికే 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ గత 35 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం వల్ల మృతి చెందిన చిన్నారికి వైరస్ ఎక్కడ సోకిందనేది అంతుబట్టడం లేదు. మృతిచెందిన చిన్నారి ప్రాథమిక కాంటాక్టులకు సంబంధించి మొత్తం 10 మందిని హోం క్వారంటైన్ చేశారు.
నలువైపులా దిగ్భంధం
- సూర్యాపేట జిల్లాలో ఐసోలేషన్ వార్డులో నలుగురు ఉండగా.. హోం క్వారంటైన్లలో 2,615 మంది ఉన్నారు.
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,785 మంది హోం క్వారంటైన్లలో ఉన్నారు.
- నల్గొండ పట్టణంతో పాటు.. జిల్లాలోని పలు గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కల్వకుర్తికి రాకపోకలు బంద్
- నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో పాజిటివ్ కేసు వెలుగుచూసిన దృష్ట్యా.. ఆ ప్రాంతం మీదుగా కల్వకుర్తికి వెళ్లే బస్సులను గత ఐదు రోజుల నుంచి నిలిపివేశారు.
- దేవరకొండ నుంచి కల్వకుర్తికి రాకపోకలు సాగించే బస్సులను డిపోలకే పరిమితం చేశారు. పాజిటివ్ వ్యక్తి ప్రాథమిక కాంటాక్టులున్న గుండ్లపల్లి మండల పరిధిలోని పల్లెలో మూడు కుటుంబాలు హోం క్వారంటైన్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్