Controversy over election symbols in the munugode: మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. తొలుత రోడ్‌రోలర్ కేటాయించి ఆ తర్వాత గుర్తు మార్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. రోడ్‌రోలర్ కేటాయిస్తూ ఆర్వో సంతకం చేసిన కాపీని ఫిర్యాదుకు జతచేసినట్టు సమాచారం. మరో స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానయ్య గుర్తుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన ఈసీ అధికారులు ఆ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితోపాటు ఆర్వోను ఆదేశించింది. గుర్తుల కేటాయింపుపై ఈసీ అధికారులు వివరణ కోరారన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కె.శివకుమార్‌కు తిరిగి రోడ్ రోలర్‌గుర్తు కేటాయించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికే బ్యాలెట్‌లను ప్రచురణకు పంపినట్లు.. ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలని ఈసీ ఆదేశిస్తే మారుస్తామని స్పష్టం చేశారు.
యుగతులసీకి తొలుత రోడ్‌రోలర్ కేటాయించి తర్వాత తొలగించడాన్ని ఆ పార్టీ అభ్యర్థి శివకుమార్ తప్పుబట్టారు. ఎన్నికల అధికారుల్లో కొందరు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. రోడ్ రోలర్ గుర్తునే తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తన కార్యాలయానికి వచ్చి రోడ్‌రోలర్ గుర్తును వదులుకోవాలని ప్రలోభపెట్టారని శివకుమార్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో తెరాసను ఎదుర్కొనే ధైర్యం లేక భాజపా ఈసీని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
తెరాస ఓట్లను చీల్చేందుకు కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కుట్రపూరితంగా కేటాయించిందని ఆరోపించారు. గుర్తుల కేటాయింపులో డీఈఓ, ఆర్వో తెరాసకు అనుకూలంగా వ్యవహరించారని భాజపా నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోపాటు సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తక్షణం వారిద్దరిని విధుల నుంచి తప్పించి, ఇతరులను నియమించాలని రాష్ట్ర ముఖ్యనేత ఒకరు అమిత్ షాను కోరినట్లు సమాచారం. ఆ విషయంపై స్పందించిన అమిత్ షా ఒకట్రెండు రోజుల్లో సదరు అధికారులపై చర్యలు ఉంటాయని, ఆ లోపు పార్టీ పరంగా పోరాడాలని సూచించినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: