నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించారు. తెరాస నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25 వేల 682 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉత్తమ్ విజయం సాధించటం వల్ల కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.
సత్ఫలితాన్నిచ్చిన ప్రయోగం..
రాష్ట్రంలో మనుగడ ప్రశ్నార్థకమైన కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేసింది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు దీటైన అభ్యర్థులను బరిలో నిలిపింది. స్థానిక పరిస్థితులను బట్టి పీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలను పోటీ చేయించింది. అందులో భాగంగానే గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని రంగంలోకి దింపింది. హుజూర్నగర్ శాసనసభ్యునిగా గెలిచిన ఉత్తమ్‌ను నల్గొండ పార్లమెంటు బరికి ఆదేశించింది అధిష్ఠానం. ఈ ప్రయోగం సత్ఫలితాన్నే ఇచ్చింది.
ఉమ్మడి నల్గొండలో కొనసాగిన కాంగ్రెస్ హవా..
ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్లమెంటు బరిలో నిలిపి కాంగ్రెస్ విజయవంతమైంది. మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం హవా కొనసాగింది. 2014 ఎన్నికల నుంచి తెరాస బలం పుంజుకుంది. 2018 శాసనసభ ఎన్నికల వరకు కాంగ్రెస్ 3 స్థానాలకు పడిపోగా... నకిరేకల్ ఎమ్మెల్యే కూడా కారెక్కడం వల్ల కార్యకర్తల్లో మరింత నైరాశ్యం నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో... సీనియర్ల పోటీ అనివార్యమైంది. నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్నగర్ నుంచి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కోదాడ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి గెలిచి, ఈసారి ఓడిపోయారు. అయినప్పటికీ రెండు సెగ్మెంట్లలో ఉత్తమ్ దంపతులకు మంచి పట్టుంది. నల్గొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేటలో బలమైన క్యాడర్ ఉంది. పార్టీ పరువు కాపాడుకునేందుకు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఉత్తమ్ గెలుపు కోసం కృషి చేశారు. జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, బాలూనాయక్ ఉత్తమ్‌కు పూర్తిగా సహకరించి విజయానికి పాటు పడ్డారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి బరిలో ఉన్నప్పటికీ... ఆయన అనుచరవర్గం ఉత్తమ్‌కు అండగా నిలిచారు. మొత్తానికి ఈ విజయంతో కాంగ్రెస్‌లో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి