Congress on Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను కాంగ్రెస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మిగతా ప్రధాన పార్టీల కంటే ముందే ప్రచారం చేపట్టింది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థిని త్వరితంగానే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రచార హోరు పెంచాల్సిన కాంగ్రెస్ కాస్త వెనుకపడింది. భాజపా, తెరాస రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని రంగంలోకి దించి జోరు పెంచితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రచారంలో ఊపు లేదనే విమర్శలు: బూత్ స్థాయి సమన్వయకర్తలు, క్లస్టర్ ఇంఛార్జ్‌లు మండలానికి సీనియర్లను ఇంఛార్జ్‌లుగా నియమించినా ఆ దిశగా ప్రచారంలో ఊపు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడప గడపకు ప్రచారాన్ని ఉద్ధృతం చేయాల్సిన కాంగ్రెస్ వెనుకపడిపోతోంది. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, వీహెచ్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు మండలాల ఇంఛార్జ్‌లుగా ఉన్నారు.
క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు భాజపా, తెరాసకు దీటుగా ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్, ఉత్తమ్ సీతక్క, సంపత్‌కుమార్ వారంపాటు నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేశారు. నామినేషన్ రోజున నేతులంతా ఐక్యంగా హాజరయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే కాంగ్రెస్ ప్రచారం అటకెక్కింది. అభ్యర్థి స్రవంతి మాత్రమే ఇంటింటా ప్రచారంతో కార్యక్షేత్రంలో కదులుతున్నారు.
మునుగోడు కంటే రాహుల్ పాదయాత్రకే ఎక్కువ ప్రాధాన్యత: డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని కొందరు నేతలు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ జోడోయాత్ర 23 న రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండడంతో దానిని విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మునుగోడు కంటే రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయాలన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రచారం లేక... పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికైనా ప్రచారంలో నిమగ్నమైతేనే తగిన ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ఇవాళ్టి నుంచి 20 వరకు నియోజక వర్గంలోనే ఉండి ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఇవీ చదవండి: ప్రతి పల్లెనూ చుట్టేస్తున్న నేతలు.. మునుగోడులో ప్రచార జోరు తగ్గేదే లే..
'గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలం'
భాజపా X ఆప్ X కాంగ్రెస్.. గుజరాత్ బరిలో 'త్రిముఖ' వ్యూహాలు