కుందూరు జానారెడ్డి... ఈ పేరు వింటేనే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత అర్థమవుతుంది. 1978 నుంచి వరుసగా పదకొండోసారి పోటీ చేస్తున్నారాయన. తొలిసారి జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి తన గురువు నిమ్మల రాములు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో ఆయన మీదే గెలిచి... శాసనసభలో అడుగుపెట్టారు. అప్పట్నుంచి 1994, 2018 మినహా... ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కాలం మంత్రిగా అత్యధిక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా జానారెడ్డి రికార్డు లిఖించుకున్నారు. 2014లో ఈ సీనియర్ నేత... నోముల నర్సింహయ్యపై 16, 476 ఓట్ల ఆధిక్యతను సాధించారు. నోముల నర్సింహయ్యకు 53, 208 ఓట్లు పోలుకాగా జానాకు 69, 684 ఓట్లు సాధించగలిగారు.
మారిన ఎత్తుగడ...
ప్రతి ఎన్నికల్లోనూ చివరి పది, పదిహేను రోజులే ప్రచారం చేసే జానారెడ్డి... ఈసారి ఎత్తుగడను మార్చారు. అధికార పార్టీ ప్రతి మండలానికో ఇంఛార్జిని ప్రకటించకముందు నుంచే ఆయన... ప్రజల్లో ఉన్నారు. రెండున్నర నెలల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. గతంలో తన శిష్యులుగా ఉన్న వ్యక్తులంతా ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీల కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు. జానారెడ్డి ప్రతి ఎన్నికల్ని భుజానికెత్తుకున్న సదరు శిష్యులంతా తెరాస, భాజపాలో ఉండటంతో ఎప్పటికప్పుడు ఆయన వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోంది.
రాజకీయ దురంధరుడు...
నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పరిచయాలుండటం కాంగ్రెస్ నేతకు ప్రధాన బలం. పల్లెపల్లెలోనూ అనుచర గణం ఉండటంతోపాటు పార్టీలోనూ ఆయనకు మంచి పేరు ఉంది. ఎవరితోనూ విభేదాలు లేకపోవడం... అందరూ ఆయన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపారు. వ్యూహాల్లో సిద్ధహస్తుడిగా పేరొందిన రాజకీయ దురంధరుడు... ఎంతటి వారినైనా తనవైపునకు తిప్పుకోగల చతురత ఆయన సొంతం.
అసంతృప్తులు...
తెరాస, భాజపాలో ఉన్న జానా శిష్యులు... ఆయా పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్నారు. టికెట్ దక్కక కొందరు, పార్టీలు పట్టించుకోక మరికొందరు నిరాశతో ఉన్నారు. అలాంటి వారంతా ఈ ఉపఎన్నికల్లో జానా వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మాజీ సీఎల్పీ నేత... తన బలాన్ని మరింత పెంచుకున్నట్లే భావించాలి. కేవలం కరపత్రాల ద్వారానే ప్రచారం నిర్వహిద్దాం... ఎవరు గెలుస్తారో చూద్దాం అని ఆయన అధికార పార్టీకి సవాల్ విసిరారు.
రంగంలోకి తనయులు...
ఈ సిద్ధాంతాన్ని ఏ పార్టీ అంగీకరించకున్నా జానా వ్యూహ చతురతను తెలిసిన వారెవరైనా... ఆయన సవాల్ స్వీకరించే ధైర్యం ఉండబోదని తేల్చిచెబుతున్నారు. అనుకున్న ఆలోచనల్ని లోలోపలే అమలు చేసే జానారెడ్డి... ప్రతి గెలుపు వెనుక బలమైన వ్యక్తుల ప్రమేయంతో ముందుకు సాగారు. ఇప్పుడాయనకు ప్రియ శిష్యులు దూరమైనా... ఆయన తనయులిద్దరూ ప్రచార వ్యవహారాలన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తండ్రి సంయమనం పాటించాలని చూస్తున్నా... అధికార పార్టీతో ఏ విషయంలో తగ్గకూడదన్న భావన పెద్దాయన తనయుల్లో కనిపిస్తోంది.
అనుచరులు దూరమవడం...
ఇన్ని బలాలున్న జానారెడ్డి... తన శిష్యులు ఒక్కరొక్కరినే దూరం చేసుకోవడం ప్రధాన బలహీనత అని చెప్పవచ్చు. సెగ్మెంట్లోని ఏడు మండలాల్లో సింహ భాగం బాధ్యతలన్నీ ప్రస్తుతం... ఆయన మాజీ శిష్యులే చూస్తున్నారు. ఏడు సార్లు శాసనసభ్యుడిగా... పలుమార్లు మంత్రిగా పనిచేసినా నియోజకవర్గ అభివృద్ధిపై అనుకున్నంత స్థాయిలో పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. దిగువ శ్రేణి కేడర్‌తో నేరుగా సంబంధాలు నెరపకపోవడం ప్రధాన ప్రతికూలతగా చెప్పుకుంటారు.
దర్శనభాగ్యం కోసం...
ముఖ్య అనుచరులతో వస్తేనే దర్శనభాగ్యం కలుగుతుందన్న భావన... అక్కడి శ్రేణుల్లో వినిపిస్తుంటుంది. జానారెడ్డి ఎవరి భుజం మీదైనా చెయ్యి వస్తే... సదరు వ్యక్తి ఆయనకు దాసోహమవ్వాల్సిందేనన్న మాటలు వినిపిస్తుంటాయి. అలాంటి చతురత కలిగిన కాంగ్రెస్ సీనియర్ నేత... క్రమంగా తన బలాన్ని, బలగాన్ని కోల్పోయారు. కానీ ఇప్పటికీ ఆయన దృష్టి సారిస్తే... ఎంతటి వారినైనా తన వైపు తిప్పుకోగల మేథస్సు ఉందని ఆయన సన్నిహితులు ప్రస్తావిస్తుంటారు.
ఇదీ చదవండి: ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్, తెరాస