Rajagopal Reddy: మునుగోడు ప్రజల అభిప్రాయ ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలతో సమావేశమవుతానని వెల్లడించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాతో ప్రత్యేకంగా మాట్లాడటానికి వచ్చారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో భాజపా బలం పుంజుకుంటుందని చెప్పానని పేర్కొన్నారు.
సీఎల్పీ నేతగా భట్టి నాతో ప్రత్యేకంగా మాట్లాడటానికి వచ్చారు. కాంగ్రెస్‌కు దూరమవుతాననే ఆలోచనతో నన్ను కలిశారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయినా అధిష్టానం పట్టించుకోలేదు. రాబోయే రోజుల్లో భాజపా బలం పుంజుకుంటుందని చెప్పా. మునుగోడు ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలతో సమావేశమవుతా. -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
కాంగ్రెస్‌కు దూరమవుతాననే ఆలోచనతో భట్టి కలిశారని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పోయినా అధిష్టానం పట్టించుకోలేదని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. తెరాస నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో ఎందుకు చేరలేదో ప్రజలు గమనించాలన్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే మరింత సీరియస్‌గా పని చేయాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్‌తోనే ఉంటారని అనుకుంటున్నా: భట్టి
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గెలవబోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ ప్రజలు లక్ష్యాలు నెరవేర్చగలదని ఆయన తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీలోనే ఉంటారని అనుకుంటున్నట్లు భట్టి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల గురించి ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆయనేం చెప్పారో నాకు తెలియదు. వినలేదు’’ అని సమాధానం దాటవేశారు. పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేద్దామని ఆయనకు సూచించానన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని.. ఆ పార్టీతోనే రాష్ట్ర ప్రజల లక్ష్యాలు అవసరాలు తీరతాయని భట్టి అన్నారు.
సోనియాగాంధీ, రాహుల్ అంటే రాజగోపాల్‌రెడ్డికి చాలా గౌరవం ఉంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించా. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని రాజగోపాల్‌తో చెప్పా. రాజగోపాల్ మా ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడడానికి వచ్చా. రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళతారని నేను భావించట్లేదు.- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
కేసీఆర్‌పై సీరియస్‌గా కొట్లాడదామని రాజగోపాల్ అన్నారని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ వల్లే సాధ్యమని తెలిపారు. అభివృద్ధి పనుల దృష్ట్యా వివిధ మంత్రులను ఎమ్మెల్యేలు కలుస్తారని వివరించారు. పదవులు చాలా మంది కోరుకుంటారు.. కానీ కొందరికే వస్తాయన్నారు. దాదాపు రెండు గంటలపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేత, రాజగోపాల్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవీ చదవండి: Uttam On Debts: ఎనిమిదేళ్లలో రాష్ట్ర అప్పు ఐదు రెట్లు పెంచారు: ఉత్తమ్
మోదీ సలహాతో డైట్ మార్చిన యువ నేత.. బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు!