Congress is ready to release the charge sheet: మునుగోడు ఉపఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తూ కాంగ్రెస్, తెరాస, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోడానికి తెరాస, భాజపాలను ఎదుర్కొని పోరాడేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది. రాజగోపాల్ రెడ్డి పార్టీని ఎందుకు వీడడంతో.. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలు స్థితిగతులు, భాజపా రాష్ట్రానికి చేసిన అన్యాయం తదితర అంశాలపై సమగ్రమైన మూడు పేజీల ఛార్జ్‌షీట్ సిద్దం చేసింది.
కాంట్రాక్టులు తెచ్చుకోనేందుకే భాజపాలో చేరారు: ప్రధానంగా మూడు పేజీల ఛార్జ్ షీట్‌లో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా మరచిపోయారని ఆరోపించిన కాంగ్రెస్.. భాజపాతో రూ.22 వేల కోట్ల మైనింగ్ ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్‌ను వీడి మునుగోడు ప్రజలను వంచించారని ఆరోపించారు. తెరాస పార్టీతో దోస్తీ చేసి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ కాంట్రాక్టులు తెచ్చుకున్న స్వార్థపరుడని ధ్వజమెత్తారు. ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల, కళాశాలలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చి తప్పారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు.
గత హామీలు మాట ఏమిటి: పింఛన్ రాని వాళ్లకు తన సుశీ ఫౌండేషన్ నుంచి ఇస్తానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఆ హామీని అటకెక్కించారని ఆరోపించారు. పేదలకు సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతీ గ్రామంలో తాను సీసీ రోడ్లు వేయించకుంటే మళ్లీ ఓట్లు అడగనని ప్రజలను మభ్య పెట్టారని ధ్వజమెత్తారు. గెలిచిన 100 రోజుల్లో చర్లగూడెం రిజర్వాయరు ముంపు బాధితులకు పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు పూర్తి బాధ్యత తనదేనని మాట ఇచ్చి మొహం చాటేశారని విమర్శించారు.
రిజర్వేషన్లకు గండి కొడుతున్న భాజపా: భాజపా 5 శాతం జీఎస్టీతో చేనేత కార్మికుల పొట్టకొట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఫ్లోరైడ్ నిర్మూనలకు చౌటుప్పల్‌కు తమపార్టీ మంజూరు చేసిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ కేంద్రాన్నిఏర్పాటు చేయలేదని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, డిండికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించలేదని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఉద్యోగాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భాజపా గండికొడుతోందని హస్తం నేతలు విమర్శించారు.
ప్రాజెక్టులు గాలికి వదిలేశారు: తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు దాటినా డిండి, చర్లగూడెం, కిష్టరాయినిపల్లి, బ్రాహ్మణ వెల్లంల, రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా రైతులను క్షోభకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చండూరు, నాంపల్లి రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తామని, ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ హామీని మరిచారన్నారు. ఉద్యోగాల భర్తీ చేయకపోగా, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని, ప్రతీ నిరుద్యోగికి తెరాస ప్రభుత్వం మొత్తం రూ.1,32,704 కోట్లు బాకీ పడిందని తెలిపారు.
ఇవీ చదవండి: