మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర స్థాయిలో ప్రక్రియ పూర్తిచేసిన పీసీసీ ఏఐసీసీకి నివేదించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రకటనతో సంబంధం లేకుండా ప్రచార బరిలోకి దిగింది. నాయకుల మధ్య విబేధాలు లేవని ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే తెరాస, భాజపా వైఫల్యాలపైమునుగోడులో జరిగిన ఛార్జ్‌షీట్ విడుదల కార్యక్రమానికి సీనియర్లు హాజరయ్యారు. భువనగిరి MPకోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నాయకులంతా కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే బాధ్యతను A.I.C.C ఇన్‌ఛార్జి కార్యదర్శులు తీసుకున్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్, ఛార్జీషీట్‌లోని అంశాలను గడపగడపకు తీసుకెళ్లాలని మండల ఇన్‌ఛార్జీలను పీసీసీ ఆదేశించింది. ఇందుకు అవసరమైన ప్రచార కరపత్రాలను భారీగా సిద్దం చేసింది. మన మునుగోడు-మన కాంగ్రెస్ అన్న నినాదంతో ఓటర్లను కలుసుకుంటూ తెరాస, భాజపాల వైఫల్యాలను వివరిస్తున్నారు హస్తం నేతలు. ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడారని... అందుకోసమే ఉపఎన్నిక వచ్చిందని వివరిస్తున్నారు.
వృద్ధులు కనిపిస్తే వారికి పాదాభివందనాలుచేస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఓట్లు అడగడం... సెంటిమెంట్‌ను రాజేసి తమవైపు తిప్పుకోవచ్చని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అభ్యర్థి ప్రకటనపై ప్రచార సందర్భంగా పార్టీ శ్రేణులు అడుగుతున్నా.. ఏఐసీసీ చేతుల్లో ఉందని చెప్పి సమాధం దాటవేస్తూ వస్తున్నారు. హుజారాబాద్ మాదిరి అభ్యర్థి ప్రకటనపై జాప్యం చేయవద్దని ప్రచారానికి వచ్చిన నాయకులకు పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి.