CM KCR Speech at Huzurnagar Praja Ashirwada Sabha : ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు అని.. అది ప్రజల తలరాత, భవిష్యత్తును నిర్దేశిస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల వెనుక పార్టీ ఉంటుందన్న ఆయన.. పార్టీల చరిత్ర, వైఖరి, దృక్పథం ఏంటో తెలుసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే నాయకులు కళ్ల ముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తారని.. ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
'30 తారీఖు మన వేలి మీద ఇంకు.. ఆ తర్వాత స్టేట్ అంతా పింకే పింకు'.. BRS నేతల నెక్స్ట్ లెవెల్ ప్రచారం
ఈ సందర్భంగా 1956లో తెలంగాణను ఏపీలో కలపాలని ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ తెలిపారు. ఆ ప్రపోజల్‌ను విద్యార్థులు, ఉద్యోగులు వ్యతిరేకించారని చెప్పారు. ఇడ్లీ, సాంబారు గోబ్యాక్ ఉద్యమ సమయంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారన్న ఆయన.. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కనీసం నోరు మెదపలేదని అన్నారు. పదవులు, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఏమాత్రం వ్యతిరేకించలేదని.. రాష్ట్ర ప్రజల బాధ కాంగ్రెస్ నేతలకు అక్కర్లేదన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు. అది ప్రజల తలరాత, భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల వెనక పార్టీ ఉంటుంది. పార్టీల చరిత్ర, వైఖరి, దృక్పథం ఏంటో తెలుసుకోవాలి. నాయకులు.. కళ్ల ముందు జరిగిన చరిత్రనూ వక్రీకరిస్తారు. ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటు వేయాలని కోరుతున్నా. - సీఎం కేసీఆర్
1956లో కాంగ్రెస్ చేసిన పొరపాటుకు దశాబ్దాల తరబడి బాధపడ్డామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ ఇచ్చుడో.. అని నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. ఇక తెలంగాణ ఇవ్వడం తప్పదని కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామన్న కేసీఆర్.. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకాన్ని స్వామినాథన్, ఐరాస ప్రశంసించిందని.. కాంగ్రెస్ నేతలు మాత్రం దూషిస్తున్నారని మండిపడ్డారు.
పంజాబ్ తర్వాత వ్యవసాయంలో రెండో స్థానంలో ఉన్నామని.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ అంటోందని.. ఏసీలో ఉండి సాగు తెలియని వ్యక్తి కూడా విద్యుత్ వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ధరణి తొలగించాలని చెబుతున్నారని.. అసలు ధరణి గురించి రాహుల్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తే రైతు బంధు, రైతు బీమా, ధాన్యం డబ్బులు ఖాతాల్లో ఎలా జమవుతాయన్నారు. రైతు బొటనవేలు పెడితే తప్ప సీఎం కూడా భూమిని మార్చలేరని.. ప్రజలకు ఇచ్చిన ఈ అధికారాన్ని వదులుకుంటారో.. కాపాడుకుంటారో ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు.