CM KCR on Munugode By Poll: మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలతో అధికార తెరాస గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు ఇతర ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఉప ఎన్నికలో తెరాస విజయం ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని.. కచ్చితంగా గెలుస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే ఇతర పార్టీలు.. ముఖ్యంగా భాజపా హడావిడి చేస్తోందని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్లుండి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా కీలక నేతలందరూ మునుగోడుపైనే దృష్టి సారించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. మునుగోడులో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు. ప్రతీ ఓటరును కనీసం రెండుసార్లు కలిసేలా ప్రచార ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికకు భారీగా గులాబీ సైన్యం మోహరించేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ బాధ్యతలు కేటాయించారు. ఎల్లుండి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. త్వరలో మరో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్రణాళిక చేస్తున్నారు. సీపీఐ, సీపీఎంలతో సమన్వయం చేసుకుంటూ వామపక్షాల ఓట్లన్నీ కచ్చితంగా తెరాసకు పడేలా వ్యూహాలు చేస్తున్నారు.
సుమారు 2 నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న తెరాస.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం.. భాజపా, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారయింది. రేపు దసరా రోజున సీఎం కేసీఆర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య తదితరులు కూడా ఆశించినప్పటికీ.. కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అధిష్ఠానం సూచనల మేరకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇవీ చూడండి..
దసరా రోజు యధావిధిగా పార్టీ నేతల భేటీ: కేసీఆర్
మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా.. తక్షణమే అమల్లోకి ఎన్నికల నియమావళి