కష్టాలు వస్తే కొన్నాళ్లకు పోతాయి.. ఎప్పుడూ కన్నీళ్లు వెంటబెట్టుకునే ఉంటాయా మనకంటూ మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతోనే మనిషి జీవితాన్ని గడుపుతాడు. కానీ కష్టాలకు కూడా కనికరం లేకుడా ఒకదాని వెనుక ఒకటి వచ్చి జీవితాలను ఛిద్రం చేస్తే ఎంతని తట్టుకోగలం... అలాంటిది ఆడుకునే వయసులోనే అమ్మా నాన్న దూరమై... నా అన్నవాళ్లే కరవై.. తమ తోటి పిల్లలంతా ఆనందంగా ఉంటే తమ బతుకులెందుకు ఇలా అయ్యాయని ఆ బిడ్డలు రోదిస్తున్నారు. ఏ తప్పు చేయని తమకు ఇంతటి శిక్ష ఎందుకని దీనంగా రోదిస్తున్న ఆ బిడ్డల పరిస్థితి చూస్తే హృదయం కలిచివేస్తోంది.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాంతానికి చెందిన పోలగొని కృష్ణయ్య, యాదమ్మలకు ముగ్గురు ఆడబిడ్డలు.. గ్రామంలోనే భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. పంటలు పండక అప్పుల పాలై... ఆర్థిక ఇబ్బందులతో 2012లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ భారం, పిల్లల పోషణ.. భార్య యాదమ్మ తన భుజాన వేసుకుని కూలి చేస్తూ ముగ్గురు ఆడపిల్లలను చదివించుకుంటూ నెట్టుకొచ్చింది.
కష్టాలను పంటి కింద బిగబట్టి ఓర్పుతో బతుకు బండిని లాగుతున్న ఆ కుటుంబాన్ని చూసి.. మరోసారి విధికి కన్ను కుట్టింది. ఆ పిల్లలకు ఉన్న ఒక్కగానొక్కదిక్కు "యాదమ్మ" అనారోగ్యం పాలైంది. పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ మహమ్మారి కబళించింది. వైద్యం చేయించుకునే స్తోమత లేక... మంచం పట్టి కన్నుమూసింది. ఐదో తరగతి చదువుతున్న చిన్న కూతురే ఆ తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది.
తల్లి మరణంతో ఆ ముగ్గురు ఆడబిడ్డలు అనాథలయ్యారు. పదో తరగతి చదువుతున్న పెద్ద కూతురు మమత ఇద్దరు చెల్లెల్లకు పెద్ద దిక్కుగా మారింది. లోకం తెలియని తానే తన చెల్లెల్లను ఎలా పెంచాలో తెలియని స్థితిలో ఉంది... తాను ఏడిస్తే చెల్లెల్లిద్దరికీ ఎవరు ధైర్యం చెబుతారని కన్నీటిని రెప్పల కిందే దాచుకుని సాయం కోసం ఎదురుచూస్తోంది. చేతిలో చిల్లుగవ్వ లేని ఆ కుటుంబానికి ఉన్న ఒక్కగానొక్క దిక్కు వృద్ధురాలైన నాయనమ్మే. ప్రభుత్వం స్పందించి తమకు సాయం చేయాలని అశ్రునయనాలతో వేడుకుంటున్నారు.