నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కొలువైన చెర్వుగట్టులో.. వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉదయం వైభవంగా జరిగిన అంకురార్పణ కార్యక్రమానికి.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు.. హాజరయ్యారు. శనివారం కీలకమైన స్వామివారి కళ్యాణ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో... కల్యాణం, అగ్నిగుండాల కార్యక్రమాలు ప్రధాన ఘట్టాలుగా నిలుస్తాయి. సాయంత్రం కోనేరులో తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. 22న ఉదయం అగ్ని గుండాలు ఏర్పాటు చేస్తారు
అగ్ని గుండాల్లో వేసి
శైవాలయాల్లో శివరాత్రి నాడు కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. చెర్వుగట్టులో మాత్రం... ఏటా మాఘశుద్ధ సప్తమి అయిన రథసప్తమి నాడు స్వామి వారి వివాహం జరిపిస్తారు. మాఘ మాసంలో జరిగే స్వామి వేడుకను తిలకించి తరించేందుకు.. పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. శివనామస్మరణలు, భక్తజన సందోహంతో.. చెర్వుగట్టు కిక్కిరిసిపోతుంది. కల్యాణం, అగ్నిగుండాల వేడుకల్లో శివసత్తులు ప్రధాన ఆకర్షణ అవనుండగా.. ఒడిబియ్యం పోసి వారంతా మొక్కులు చెల్లించుకుంటారు. రైతులు తాము పండించిన చిరుధాన్యాలు, ఆముదం, పత్తిని అగ్ని గుండాల్లో వేసి... వాటిపై నడుస్తూ మొక్కు తీర్చుకుంటారు.
ప్లాస్టిక్ రహితంగా
వాహనాల పార్కింగ్ కోసం... యల్లారెడ్డిగూడెం, నార్కట్ పల్లి వైపు స్థలాలు కేటాయించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తుండగా... తాగునీటి వసతుల్ని అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ రహితంగా జాతర నిర్వహిస్తామంటున్నారు. వంద సీసీ కెమెరాలు, పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
23న ఉదయం 6 గంటలకు దోపోత్సవం, అశ్వవాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి. అదేరోజు రాత్రి 7 గంటలకు పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 24న సాయంత్రం గ్రామోత్సవాన్ని చేపడతారు. అంతటితో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
ఇదీ చూడండి : కుంభ్ సందేశ్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత