CEO Vikas Raj on Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల ప్రచారం ఇవాళ్టి సాయంత్రంతో ముగుస్తున్న వేళ రాజకీయపార్టీలు, అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత బయటి వారు ఎవరూ నియోజకవర్గంలో ఉండరాదన్న ఆయన.. విస్తృత తనిఖీలు చేయాలని అధికారులు, బృందాలను ఆదేశించినట్లు చెప్పారు. పెద్దమొత్తంలో ఎస్సెమ్మెస్‌లపై నిషేధం ఉందని, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయరాదని సీఈవో తెలిపారు. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు 479 ఫిర్యాదులు వచ్చాయని, 185 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 80 లక్షల నగదు, 4,500 లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్ వివరించారు. 111 బెల్ట్ షాపులు మూసివేసినట్లు చెప్పారు. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఫిర్యాదుల కోసం సీవిజిల్ యాప్ ఉపయోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్న వికాస్ రాజ్.. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి గంటకూ నేరుగా ఓటింగ్ శాతం నమోదు..: 3,366 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉంటారని.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు, మెడికల్ బృందాలు ఉంటాయని అన్నారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు.
వివరణ అందింది.. ఈసీకి నివేదించాం..: మరోవైపు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీకి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నుంచి వివరణ అందిందని, ఈసీకి నివేదించినట్లు సీఈవో వికాస్‌రాజ్ చెప్పారు. చేతులపై పార్టీల గుర్తులు వేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. రిటర్నింగ్ అధికారిపై సీఈవో కార్యాలయం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.
మునుగోడు ఉపఎన్నికకు 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఆఫీసర్లు ఉంటారు. మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రేపు సాయంత్రం 6 తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు ఉంటాయి. రేపు 6 తర్వాత స్థానికేతరులు ఉండకూడదు. - వికాస్‌రాజ్, సీఈవో
ఇవీ చూడండి..
BJP Election Campaign in Munugode : మునుగోడు ప్రచారంలో హోరెత్తిస్తున్న భాజపా
106+ ఏజ్‌లో మళ్లీ ఓటు వేసేందుకు సిద్ధం.. పోలింగ్ బూత్‌లో రెడ్ కార్పెట్ వెల్కమ్