Kishanreddy on Palivela Issue: మునుగోడులోని పలివెల గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. భాజపా నేతల ఫోన్లను రాష్ట్ర సర్కార్ ట్యాప్ చేస్తోందని మండిపడ్డారు. తెరాస దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. మునుగోడులో ఓడిపోతామనే తెలిసి తెరాస దాడులకు దిగుతుందన్నారు. హింసను ప్రేరేపించేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారన్న ఆయన.. వ్యూహం ప్రకారమే దాడికి దిగారని పేర్కొన్నారు. డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని ఘర్షణకు పాల్పడ్డారన్నారు.
గొడవ జరగవద్దనే ఉద్దేశంతో ఈటల సంయమనం పాటించారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇటీవల పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి తన సభను కూడా ఇలాగే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు సిబ్బంది తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెరాస దాడులకు భాజపా కార్యకర్తలు భయపడరన్న కిషన్‌రెడ్డి.. తెరాస నేతల కార్లను పోలీసులు తనిఖీ చేయటం లేదని మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. పలివెల గ్రామంలో తెరాసకు ఓట్లు రావని తెలిసి దాడికి దిగారన్నారు. తెరాస అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఫలితంతో తెరాస కాలుకాలిన పిల్లిలా తయారైందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓ వైపు భాజపా, మరోవైపు తెరాస ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు గన్‌మెన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. ములుగు జడ్పీఛైర్మన్ కుసుమ జగదీశ్‌కు గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: