Munugode Election campaign of all parties: రాజకీయ నేతల హామీలు.. హోరెత్తించే నినాదాలు.. డీజే పాటల శబ్దాలు.. రద్దీగా రహదారులు ఇదంతా మునుగోడు నియోజకవర్గంలో సందడి. ఉపఎన్నిక వేళ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా తమ పార్టీ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. తెరాస గెలుపే లక్ష్యంగా మునుగోడులో మోహరించిన నేతలు తమ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపించేందుకు ఓటర్లచెంతకు వెళ్తున్నారు.
రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు,ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి అభ్యర్థి గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మునుగోడు నియోజకవర్గం కొంపల్లిలో గౌడ కులస్థులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించిన మంత్రి కూసుకుంట్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పుల్లెంలలో పర్యటించిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఉపఎన్నికలో తెరాసను గెలిపించాలంటూ విజ్ఞప్తిచేశారు. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. చండూరు, అంగడిపేటతో పాటు పలుగ్రామాల్లో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని భాజపా శ్రేణులు రాజగోపాల్‌కు ఘనస్వాగతం పలికారు. తెరాస సర్కార్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకపోవడం వల్లే రాజీనామా చేసి ప్రభుత్వంతో కొట్లాడుతున్నానని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెరాస మోసాలను గమనించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల కట్టలతో మునుగోడు ఉపఎన్నిక గెలిచేందుకు తెరాస ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాంపల్లి మండలం మెల్లవాయిలో అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సీతక్క ప్రచారం చేశారు. పత్తి చేనులో మహిళా రైతులను కలిసిన సీతక్క హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.
మునుగోడు మండలం సొలిపురంలో పాల్వాయి స్రవంతి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించారు. మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. గడప గడపకూ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్న స్రవంతి వాటి పరిష్కారం కోసం ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. చండూర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న భట్టి విక్రమార్క.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్‌కు మునుగోడు ఎన్నిక కీలకమన్న భట్టి కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు.
ఇవీ చదవండి: