RS Praveen Kumar in BSP review meeting: నల్గొండ జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ దూసుకుపోతోందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బీఎస్పీకి గ్రామాల నుంచి ఆదరణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రజలు గమనిస్తున్నారు
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆర్ఎస్ అన్నారు. రైతులు, నిరుద్యోగులు, బలహీన వర్గాలకు తెరాస ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల సమావేశాలకు ఒమిక్రాన్ భయం చూపిస్తూ.. అధికార పక్షం మాత్రం రైతుబంధు సంబరాలంటూ వివిధ రకాల వేడుకలు చేసుకుంటోందని ఆరోపించారు. అధికార పార్టీకి ఒక రూల్.. ప్రతిపక్షాలకు ఒక రూలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తికి తెరాస ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు.
నిధులు ఏమయ్యాయి
"రాష్ట్రంలో విద్యకు కేటాయించిన రూ. 7,300 కోట్లు ఎప్పుడు ఇస్తారు.? రాష్ట్రంలోని 600 గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆ నిధులన్నీ ఏమయ్యాయో వివరణ ఇవ్వాలి. బార్లు, సినిమా హాల్స్, మాల్స్‌లో లేని కొవిడ్ ఆంక్షలు.. పాఠశాలలకే ఎందుకు అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఖరితోనే ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు."
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ తెలంగాణ సమన్వయ కర్త
ఇదీ చదవండి: CS on Fever Survey: వారం రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తిచేస్తాం: సీఎస్