ఉద్యోగ, ఉపాధ్యాయుల, రిటైర్డ్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలోని జిల్లా కలెక్టరే కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను ముఖ్యపాత్రగా తీసుకోకపోవడం పెద్ద తప్పిదమని విమర్శించారు.
అధికారం నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఎంతో మంది అమరులై రాష్ట్రం సాధిస్తే.. ఒక కుటుంబం మాత్రమే దానిని అనుభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నియామకాల కోసం రాష్ట్రం సాధించుకుంటే.. తెరాస పార్టీ మాత్రం నిరుద్యోగుల ఆశలను ఆడియాశలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అందులో 50 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. అవి కూడా ఎక్కువగా పోలీసు ఉద్యోగాలే. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లర్ల సమస్యలను తమ పార్టీ మాత్రమే పరిష్కరిస్తుంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరుకుంటున్నా"
-ప్రేమేందర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: భర్త వివాహేతర గుట్టును బయటపెట్టిన భార్య