నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కృష్ణాపురం గ్రామంలో వెంకట్ రెడ్డి అనే రైతు కూరగాయల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూనే వ్యవసాయంపై తనకున్న ఇష్టంతో 8 ఎకరాల పొలంలో కాకర పంటను ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయలను పండిస్తున్నాడు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రైతులు కూరగాయల సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఎకరాకు రెండు లక్షల ఆదాయం:
కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు వెంకట్ రెడ్డి ఎకరన్నర భూమిలో కాకర సాగుచేస్తున్నాడు. మొదట భూమిని నాలుగు నుంచి ఐదు సార్లు దున్నుకొనేవారు. దానిలో పశువుల ఎరువు వేసి బోదెలను చేసి, దానిపై మల్చింగ్ ఏర్పాటు చేసుకొని కాకర విత్తనాలు నాటాడు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తూ, సస్యరక్షణ పాటిస్తూ అధిక దిగుబడులను పొందుతున్నాడు.
60 రోజుల్లో పంట చేతికి :
ఎకరానికి 500 గ్రాముల నుండి ఒక కిలో వరకు కాకర విత్తనాలను విత్తుకోవాలి. గింజ నాటిన కొత్తలో 12.61 డ్రిప్ ద్వారా ఎరువులను ఎక్కించాలి. కాకర తీగను పురికొస సాయంతో పందిరికి ఎక్కించుకోవాలి. ఈ క్రమంలో తీగకు ఉన్నటువంటి శాఖలను కట్ చేస్తూ వెళ్లాలి. కాకర నాటిన రోజు నుంచి 60 రోజులకు కాపుకు వస్తుందని రైతు తెలిపాడు. చీడ పీడలను నివారిస్తూ ఉంటే 100 రోజుల వరకు పంటచేతికి వస్తుందన్నారు. ఎకరానికి ఖర్చులు పోను రెండు లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని రైతు వెంకటరెడ్డి అంటున్నాడు.
మందులు సకాలంలో స్ర్పే చేయాలి:
కాకర సాగులో మొదట విత్తనాలు ఎంచుకుని విత్తుకోవాలి. గింజనాటిన కొత్తలో, పూత పిందె దశలో పదిహేను రోజులకోసారి డ్రిప్ ద్వారా రసాయన ఎరువులు ఎక్కించాలి. సూక్ష్మ ధాతు పోషకాలను లీటరు నీటిలో 8 గ్రాములు చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. కాయ కట్టే దశలో చీడపీడలకై కాయతొలుచు పురుగు నివారణ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి క్లోరాంట్రినిపోలిన్ ఒక మిల్లీ లీటర్ తీసుకొని లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయాలి. రసం పీల్చే పురుగులు, తెల్ల దోమల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ ఒక మిల్లీలీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి 10 పసుపు పచ్చ పేపరు అట్టలను ఏర్పాటు చేసుకుని తెల్ల దోమలను నివారించవచ్చును.
తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలి :
సకాలంలో రసాయన మందులను వినియోగించి తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని వెంకట్ రెడ్డి సూచించారు. కాకరలో పండు ఈగ నివారణకై మలాథియాన్ లీటరు నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి . అదేవిధంగా ఫిరోమిన్ ట్రాప్స్ ఎకరానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసుకొని పండు ఈగ దోమలను నివారించవచ్చును. బూజు తెగులు నివారణకు క్లోరోథాలోనిల్ ఒకటిన్నర మిల్లీగ్రామ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మెలకువలు పాటిస్తే అధిక లాభాలు: అధికారులు
ఈ విధంగా తెగుళ్లను నివారిస్తూ సస్యరక్షణ పాటిస్తూ రైతులు కాకర సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొంది, లాభాలు గడించివచ్చని హార్టికల్చర్ అధికారులు తెలుపుతున్నారు. కృష్టాపురం గ్రామంలోని కొంత మంది రైతులు వెంకట్ రెడ్డి పందిరి సాగు ద్వారా కూరగాయల పండించే విధానాన్ని చూసి... కూరగాయల సాగు చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించి కొంత ఆర్థిక తోడ్పాటు అందిస్తే సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్థానిక రైతులు చెబుతున్నారు.