తాను బతికున్నంత వరకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చేయరని.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖానించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొసరు నిధులతోనే బీ-వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టును పూర్తి చేస్తే కోమటిరెడ్డికి ఎక్కడ పేరొస్తుందో అని.. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ప్రభుత్వం డెడ్లైన్లు ఎప్పుడో దాటిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్‌కే సిగ్గుచేటు..
"నేను బతికున్నంత వరకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చేయడు. పూర్తి చేస్తే.. మళ్లీ నాకు పేరొస్తదని వాళ్ల కుళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఖర్చుపెట్టిన లక్షన్నర కోట్లలో కేవలం 50 కోట్లు కేటాయిస్తే.. ప్రాజెక్టు పూర్తయితది. అయినా దాన్ని మాత్రం పట్టించుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఎంజీ యూనివర్సిటీని తెరాస ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. కళాశాలకు ఎక్కువ.. విశ్వవిద్యాలయానికి తక్కువ.. అన్నట్టు ఎంజీ యూనివర్సిటీ పరిస్థితి దిగజారింది. ఈ విషయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా. సర్పంచులకు నిధులు ఇయ్యకుండా ఇబ్బంది పెడుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే సర్పంచులంతా కలిసి రాజీనామాలు చేసేందుకు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం సీఎం కేసీఆర్‌కు సిగ్గుచేటు. ప్రశ్నిస్తున్నారన్న కోపంతో మా కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితులకు మూడెకరాల పొలం ఇస్తామని 2001 నుంచి లక్ష సార్లు చెప్పారని స్పష్టం చేశారు. ఇలా చట్టసభల్లోనే ఇచ్చిన మాటను కూడా ఇవ్వలేదని చెప్తూ.. ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: