Bandi Sanjay Campaign in munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా పక్షం రోజులు మిగిలి ఉండగా.. పార్టీలన్నీ ప్రతి గ్రామం, వాడలు చుట్టేసి ప్రచారంలో తలమునకలై ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలోపడ్డారు. రాష్ట్ర భాజపా ముఖ్యనేతలంతా ప్రచారంలో లీనం అవ్వగా.. అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం రోడ్ షోలు నిర్వహిస్తూ కేసీఆర్‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మర్రిగూడలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. మునుగోడుకు ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదిశారు.
వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు హామీలు మర్చిపోయారని ఆయన దుయ్యబట్టారు. కమ్యూనిస్టులు సొంత పగ కోసం కార్యకర్తల పోరాటాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నిక రాష్ట్రంలోని పేదల భవిష్యత్‌ను మార్చేసేదని బండి పేర్కొన్నారు. పువ్వు గుర్తుకు ఓటేసి తెరాసకు చెక్ పెట్టాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: