ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కొవిడ్-19 దృష్ట్యా ఈ సమావేశంలో కేవలం నాలుగు అంశాలైన వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలపై మాత్రమే చర్చించారు.
కరోనా వ్యాప్తి, వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలపై జడ్పీటీసీలు, ఎంపీపీలు లేవనెత్తిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్.. చర్చించి పరిష్కరిస్తామని బదులిచ్చారు. జిల్లాలో నూతన నియంత్రిత వ్యవసాయ విధానంపై ప్రజాప్రతినిధులు అందరూ పాలుపంచుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రజల వరకు ఈ నియంత్రిత వ్యవసాయాన్ని తీసుకుని పోయే బాధ్యతను జడ్పీటీసీలు, ఎంపీపీలు తీసుకోవాలన్నారు. పల్లె ప్రగతి ప్రస్థానం, హరితహారం, ఉపాధి హామీ పథకం పనులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి పనులపై జడ్పీటీసీలు, ఎంపీపీలు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు