నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మొదటి లిఫ్ట్ లో పంప్ హౌజ్ ప్రమాదవశాత్తు ముంపునకు గురైంది. మూడో మోటార్ సిమెంట్ బేస్ దెబ్బతిని పంప్ హౌజ్‌లోకి నీరు చేరింది. దీంతో పంప్ హౌజ్ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఎల్లూరు లిఫ్ట్ కి సమీపంలోనే ప్రస్తుతం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు సాగుతున్నాయి. సొరంగంలో చేపట్టిన పేలుళ్లే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం పేలుళ్లు జరిగినప్పుడు వచ్చే ప్రకంపనలు, ఎల్లూరు లిఫ్ట్ లో మోటార్లు పంపింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలూ రెండూ తోడై.. రెండో యూనిట్ పునాదులకు సంబంధించిన బోల్టులు దెబ్బతిన్నాయి. అప్పటికే మోటార్లు నడుస్తూ ఉండటంతో... మూడో మోటారు బేస్మెంట్ కదిలి ఒక్కసారిగా పంప్ హౌజ్‌లోకి నీళ్లు చొచ్చుకు వచ్చాయి. ఫలితంగా పంప్ హౌజ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వెంటనే పంపింగ్‌ను ఆవేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.
ఆ వాదన తప్పు..!
సమాచారం అందుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి హుటాహుటిన ఎల్లూరు లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి అవసరాల కోసం రెండో పంపు ప్రారంభమైన.. మూడు నిమిషాల్లో పెద్దశబ్దాలతో పంప్ హౌజ్‌లోకి నీళ్లు వచ్చాయని... 20 నిమిషాల్లో పంప్ హౌజ్ నీట మునిగిందని మంత్రి తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సర్జ్ పూల్ గేట్లు మూసేసి పంప్ హౌజ్‌లోకి నీళ్లు రాకుండా చేశారన్నారు. నీళ్లను తోడేసే ప్రక్రియ ప్రారంభమైందని.. పూర్తిగా నీళ్లను తోడేస్తేనే సమస్య బయట పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య తెలిసిన నెల రోజుల్లోనే పరిష్కరిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగంలో బ్లాస్టింగ్ వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనలను ఆయన కొట్టి పారేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్ననీటినే పొదుపుగా వాడుకుంటూ రైతులకు నీళ్లందిస్తామని తెలిపారు.
తొలి నుంచి అభ్యంతరాలు..
కేఎల్ఐ పథకంలోని మొదటి ఎల్లూరు లిఫ్ట్ కి సమీపంలోనే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సొరంగం పనులు చేపట్టడంపై... మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గతంలో ఓపెన్ కెనాల్ ప్రతిపాదించిన డిజైన్‌ను సొరంగ మార్గంగా మార్చారు. ఈ సొరంగంలో తవ్వకాలు, పేలుళ్ల వల్ల కల్వకుర్తి ఎత్తిపోతలకు ప్రమాదమని గతంలోనే నీటి పారుదల శాఖ అధికారులకు పలువురు లేఖలు రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పంప్ హౌజ్‌లోకి ప్రమాదవశాత్తు నీరు చేరడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశం చర్చినీయాంశంగా మారింది.
ఇవీచూడండి: ఎల్లూరు సర్జ్‌పూల్ పంప్‌హౌస్‌లోకి చేరిన నీరు, మునిగిన మోటార్లు