నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం(amrabad tiger reserve forest). ఈ అడవిలో సాధారణ జనానికి ప్రవేశం నిషేధం. ఇక్కడ 20కి పైగా పెద్దపులులు, వందకుపైగా చిరుతలు, వేలల్లో జింకలు, 29 రకాల వన్య ప్రాణులుంటాయి. 300పైగా పక్షిజాతులతోపాటు... అరుదైన వృక్షజాతులు, అరుదైన అటవీ సంపదకు నిలయం. అలాంటి నల్లమలలోకి ప్రవేశించి అక్కడ జంతువులు, వృక్ష సంపద, చెంచుల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ అటవీశాఖ(telangana forest department). టైగర్ స్టే పేరిట సరికొత్త ప్యాకేజీ(tiger stay tourist package) ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఆద్యంతం ఆసక్తిగా..
ఆన్‌లైన్‌లో ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్లు నేరుగా మన్ననూర్‌లోని అటవీశాఖ చెక్‌పోస్ట్‌కు చేరుకుంటే... అక్కడే కాటేజీలను కేటాయిస్తారు. పక్కనే ఉన్న పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో నల్లమల అడవుల్లో జీవించే జంతువులు, వృక్షాలు, చెంచుల జీవన విధానంపై దృశ్యరూపంలో అవగాహన కల్పిస్తారు. ఆ పక్కనే ఏర్పాటు చేసిన బయోల్యాబ్‌లో ఏటీఆర్‌లో జీవించే సీతాకోక చిలుకలు, కప్పలు, పాములు, కీటకాలు, జంతువుల నమూనాలను ప్రత్యక్షంగా చూపిస్తారు. క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్‌తో టూర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.
వన్యప్రాణుల సందర్శన..
పులులు సహా ఇతర జంతువులు సంచరించే ప్రాంతాల నుంచి సఫారి టూర్ సాగుతుంది. నిజాం కాలంలో వన్యప్రాణుల వేట కోసం వచ్చినప్పుడు బస చేసేందుకు నిర్మించుకున్న శికార్ ఘర్‌ను అక్కడ చూడొచ్చు. మార్గమధ్యంలో పులులు, జింకలు, దుప్పులు, కోతులు, అడవి పందులు వంటి వన్యప్రాణులను సందర్శకులు చూసే అవకాశం ఉంటుంది. అమ్రాబాద్ అడవి ప్రత్యేకతలు, చెంచుల జీవన విధానాన్ని వివరించడానికి... శిక్షణ పొందిన చెంచులు పర్యాటకులకు గైడ్‌లుగా వ్యవహరిస్తారు.
చెంచులకు ఉపాధి కల్పించే దిశలో..
పర్యాటకాభివృద్ధి, ఆదాయం కోసం కాకుండా... పర్యావరణం, పులులు, అడవుల సంరక్షణ ఎలా సాగుతోందనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్యాకేజీ ఏర్పాటుచేశామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా అక్కడి చెంచులకు ఉపాధి కల్పించాలన్నది మరో లక్ష్యమని తెలిపారు. సఫారీ టూర్, ట్రెక్కింగ్ వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా బఫర్ జోన్‌లోనే సాగుతాయి. 12 మందిని మాత్రమే అనుమతిస్తారు. అమ్రాబాద్ అడవుల అందాలను ఆస్వాదించాలనుకుంటే, అక్కడి జీవ వైవిధ్యం, ఆదివాసీల జీవన విధానాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు టైగర్ స్టే చేయాల్సిందే.
ఇదీ చూడండి: