ఉమ్మడి పాలమూరు జిల్లాలో 615 మత్స్యకారుల సహకార సంఘాలు ఉండగా.. ఈ సంఘాల్లో 41,925 మంది సభ్యులు ఉన్నారు. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నిర్మాణాల్లోని ముంపుబాధితులు, లైసెన్సు పొందిన మరో 12 వేల మంది సభ్యుల కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ సారి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలను తలపించాయి. నీటిసామర్థ్యం మేరకు శాఖ అధికారులు వంద శాతం రాయితీపై చేపపిల్లలను వదిలారు.
దిగుబడి గత ఏడాది కంటే ఎక్కువగా వస్తుందని ఆశించినప్పటికీ కరోనా మహమ్మారి అడ్డుపడుతోందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మత్స్యసహకార సంఘాల అధ్యక్షుడు సత్యనారాయణ ‘ఈటీవీభారత్’కు తెలిపారు. నీటిమట్టం తగ్గిపోతుండటంతో చెరువులు, కుంటల్లో చేపలు పట్టే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. అయినా ఆశించినస్థాయిలో మార్కెటు సౌకర్యం లేకపోవడం వల్ల పెద్దమొత్తంలో చేపలు పట్టడం లేదని పేర్కొన్నారు. ఎండల తీవ్రత మరింత పెరిగితే.. చెరువులు, కుంటల్లో నీరు గణనీయంగా తగ్గి ఆక్సిజన్ స్థాయి క్షీణించి చేపలు మృత్యువాతపడే అవకాశాలు ఉన్నాయన్నారు. గతేడాది 26 వేల మెట్రిక్ టన్నుల చేపల దిగుబడి వస్తే.. ఈసారి 30 వేల మెట్రిక్ టన్నులు రావచ్చని అధికారులు అంచనా వేశారు. తీరా చూస్తే రవాణా, మార్కెటు సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మత్స్యకారులపై కొంత ప్రభావం పడవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.