Suspension Achampet Doctors : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆస్పత్రి ఘటనలో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సూపరింటెండెంట్ కృష్ణ, డ్యూటీ డాక్టర్ హరిబాబును సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ సోకిన గర్భిణీ ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం వచ్చారు. వైద్యులు నిరాకరించగా.. ఆస్పత్రి బయటే గర్భిణి ప్రసవించారు.
Achampet area Hospital incident : గర్భిణీలకు కొవిడ్ సోకినా, ప్రసవం కోసం వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం నిరాకరించవద్దని, అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హారీశ్‌రావు ఇటీవలే ఆదేశించారు. మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొవిడ్ సోకిందన్న నెపంతో ఓ చెంచు మహిళకు ప్రసవానికి నిరాకరించారు. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్మ.... పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిందని తేలడంతో నొప్పులతో బాధ పడుతున్నా.... ఆస్పత్రిలోకి వైద్యులు అనుమతించలేదు. పీపీఈ కిట్లు లేవని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా విధుల్లో ఉన్న వైద్యులు సూచించారు. ఆమె వెంట వచ్చిన అక్కలు ఆసుపత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకువెళ్లి... ప్రసవం చేయించారు. ఆ తర్వాత మేలుకున్న సిబ్బంది తల్లి, బిడ్డను ఆస్పత్రి లోపలికి తీసుకువెళ్లారు.
Harish Rao fires on doctors : ఘటన వివరాలు తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇద్దరు వైద్యులను సస్పెన్షన్ చేసిన వైద్య విధాన పరిషత్ .. మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
ఇదీ చదవండి: ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్