hygiene kits supply : ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి సర్కారు అనేక వసతులు కల్పిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇవేకాక గురుకులం, కేజీబీవీలలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తుంది. ఇందులో భాగంగానే విద్యార్థినులకు 14 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను రెండేళ్ల క్రితం నుంచి అందిస్తున్నారు. విద్యార్థినులకు అవసరమయ్యే సబ్బులు, కొబ్బరి నూనె, షాంపు, పౌడర్, టూత్ పేస్ట్, జడ క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు తదితర వస్తువులను ఆరోగ్య కిట్ల రూపంలో మూడు నెలలకోసారి పంపిణీ చేసేవారు. అయితే కరోనా కారణంగా పంపిణీ ఆగిపోవడంతో విద్యార్థినిలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
నానా అవస్థలు పడుతున్న విద్యార్థినులు
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 20 కేజీబీవీల పరిధిలో మొత్తం నాలుగు వేల మంది విద్యార్థినిలు విద్యనభ్యసిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇచ్చే ఈ ఆరోగ్య కిట్లు కరోనా కారణంగా ఆపివేయటంతో పేద మధ్య తరగతి వారికి 1500 వరకు అదనపు బారం పడుతుందని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కిట్ల పంపిణీ పునరుద్ధరించటంతో పాటు చలికాలాన్ని తట్టుకునేలా షూస్, స్వెట్టర్లు మరిన్ని వస్తువులు చేర్చి తిరిగి పంపిణీ చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
త్వరలోనే పునరుద్ధరిస్తాం..
విద్యార్థినులకు అందించాల్సిన కిట్ల విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించామని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు వెల్లడించారు.
ఇదీ చూడండి: రెండు డోసుల టీకా తీసుకున్న వారికే న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి