శ్రీశైలం ప్రమాద ఘటన జరిగిన సమయంలో ప్రాజెక్టు లోపల 26 మంది ఉన్నారు. ప్రాజెక్టు లోపలి నుంచి తప్పించుకునేందుకు మూడు మార్గాలున్నాయి. మంటలు అంటుకున్న వెంటనే కొందరు ప్రధాన మార్గం నుంచి బయటికి వచ్చారు. తక్కువ దూరంలోని మార్గం గుండా బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన ఆరుగురు మృత్యువాత పడినట్లు సీఐడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మంటలతో వ్యాపించిన పొగ ఆ మార్గం నుంచే బయటికి వెళ్లడం.. అదే మార్గంలో వీరూ వెళ్లడంతో ఆక్సిజన్ అందక మరణించారని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. లోపలి వైపు ఉన్న ముగ్గురు మాత్రం బయటపడే మార్గం లేక ఘటనాస్థలిలోనే మృతి చెందారని నిర్ధారణకు వచ్చారు.
టర్బయిన్లలో సాంకేతిక లోపం తలెత్తిందా?
విద్యుదుత్పత్తికి వినియోగించే టర్బయిన్లలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో సీఐడీ ఆరా తీస్తోంది. ప్రమాద సమయంలో టర్బయిన్లు కంపించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికే సీఐడీ దర్యాప్తులో కీలకం కానుంది. మరోవైపు షట్‌డౌన్ చేయకుండానే బ్యాటరీలు అమర్చినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో అందుకు కారణాలను విశ్లేషిస్తోంది. ఈ వ్యవహారంలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఏదీ లేదని దాదాపుగా అంచనాకు వచ్చింది. దుర్ఘటన ప్రమాదవశాత్తు సంభవించిందేనా? మానవ తప్పిదం వల్ల జరిగిందా? తేల్చడంపైనే సీఐడీ దృష్టి సారించింది.
ప్రమాదానికి కారణాలేమిటి?
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుతేంద్రంలో ప్రమాదానికి కారణాలపై విద్యుత్ రంగ నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. నిపుణులు బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవర్‌హౌస్‌లో తనిఖీలు చేపట్టారు. ప్రమాదంలో దెబ్బతిన్న నాలుగో యూనిట్‌ను పరిశీలించారు. దీంతోపాటు మీటర్ అండ్ రిలే టెస్టింగ్ (ఎంఆర్‌టీ) డాటా సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు సరఫరా అయిన విద్యుత్ సామర్థ్యం, ఏ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది? ముందుగా ఎకడ మంటలు వచ్చాయి? ఆ సమయంలో బ్యాటరీ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? విద్యుత్ సరఫరా ఎంతసేపు కొనసాగింది? కేబుల్ కాలిపోవడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిన సమయం తదితర సమగ్ర వివరాలు అందులో నమోదవుతాయి. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలను తెలుసుకోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఆ రోజు ఎంత మంది ఉన్నారు?:
జల విద్యుతేంద్రంలో ప్రమాదం జరిగిన రోజున ఎంతమంది ఉద్యోగులు ఉండాలి.. ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహించారో అధికారులు ఆరా తీస్తున్నారు. పవర్‌హౌస్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి డీఈ స్థాయి అధికారి అధిపతిగా ఉంటారు. డీఈ పరిధిలో ఇద్దరు ఏడీలు, ముగ్గురి నుంచి నలుగురు ఏఈలు, 10-12 మంది చొప్పున సిబ్బంది రోజూ విధులు నిర్వహిస్తారు. ప్రమాదం జరిగిన రోజున వీరిలో కొందరు హాజరు పట్టికలో సంతకం చేసి బయటకెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
పవర్‌హౌస్‌లో తగ్గుతున్న ఊటనీరు:
పవర్‌హౌస్‌లో చేరిన ఊటనీరును భారీ విద్యుత్తు మోటార్ల ద్వారా సర్జిపూల్‌లోకి ఎత్తిపోయడంతో నీటిమట్టం తగ్గుతోంది. మోటార్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో గురువారం రాత్రికి ఊట జలం మొత్తం ఖాళీ అయ్యే సూచనలు ఉన్నట్లు అధికారులు పేరొంటున్నారు. మరోవైపు సొరంగం ద్వారా బయటి గాలి లోపలికి, లోపలి గాలి బయటకు పంపే ప్రక్రియకు మరమ్మతులు పూర్తి చేశారు. సర్వీస్ బే యూనిట్ వన్‌లో లైటింగ్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. శిథిలాలను తొలగించారు.
రూ.కోటి చొప్పున పరిహారానికి డిమాండ్:
ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలంటూ బుధవారం జల విద్యుత్కేంద్రానికి వచ్చిన సీఎండీ ప్రభాకర్‌రావును జెన్‌కో ఉద్యోగుల ఐకాస సభ్యులు కోరారు. బాధిత కుటుంబాలకు, జెన్‌కోలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని సీఎండీ హామీ ఇచ్చారు.