నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ముంపునకు గురైన పంపుహౌస్‌ను పరిశీలించడానికి ఎంపీ రేవంత్‌రెడ్డి, సంపత్ కుమార్, మల్లురవి బయలుదేరారు. సమాచారమందుకున్న పోలీసులు తెలకపల్లి వద్దే వారిని అడ్డుకున్నారు.
పంపుహౌస్ సందర్శనను అడ్డుకున్న పోలీసుల తీరుపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కార్లో నుంచి దిగకుండ సుమారు గంట పాటు పోలీసులతో వారించారు. సమీపంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకుని రేవంత్‌తో పాటు మిగితా నేతలను పంపుహౌస్ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ నాగర్‌కర్నూల్-అచ్చంపేట రహదారిపై కార్యకర్తలు బైఠాయించారు. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నేతల అరెస్ట్..
కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టే క్రమంలో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. రేవంత్, సంపత్, మల్లురవిని అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిపుణుల కమిటీ సూచించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలోనే సొరంగ మార్గం పనులను చేపట్టారని.. కమిషన్‌లకు కక్కుర్తి పడి ఒపెన్ కెనాల్‌గా ఉన్నటువంటి డిజైన్‌ను సొరంగ మార్గం కింద మార్చారని.. రేవంత్ ధ్వజమెత్తారు. ఈఎన్‌సీ మురళీధర్‌రావు కుమారుడికి కాంట్రాక్టులు కట్టబెట్టడానికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లు మార్చారని ఆరోపించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను... కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను చేపడితే ప్రమాదామని ఇదివరకే ఎక్స్‌పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తామని.. పంప్‌హౌస్ వద్దకు వెళ్లకుండా తెరాస ప్రభుత్వం అడ్డకుంటుందని ఆరోపించారు.
ప్రభుత్వం పోలీసులతో కొట్టించిందని గాయాలను రేవంత్‌రెడ్డి చూపించారు. కేఎల్‌ఐ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అన్నారు. ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఎం, కేంద్ర జలశక్తి ఛైర్మన్‌పై రేవంత్ ఆరోపణలు చేశారు. ముగ్గురిపై కోర్టులో దావా వేయనున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కేఎల్‌ఐకి సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని తెలిపారు. నిపుణులు వారించినా ఉద్దేశపూర్వకంగానే నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో నిపుణుల కమిటీలు రాసిన లేఖలు, నివేదికలను మీడియాకు రేవంత్ చూపించారు.