నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని శాసనమండలిలో మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికి తీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 16న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని పెట్టారు. దానికి శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని... మానవాళితో పాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కాలుష్యం అయి మనిషి జీవితం నరక ప్రాయం అవుతుందని... అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని యావన్మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని... ప్రజల భయాందోళనతో సభ కూడా ఏకీభవిస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ అసెంబ్లీ తీర్మానం