నాగర్‌కర్నూల్ నూతన జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా... అధికారుల నిర్లక్ష్యంతో దశాబ్దాల తరబడి తిష్ట వేసిన గ్రంథాలయ సమస్యలు పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాకు ఒక గ్రంథాలయ ఛైర్మన్ వచ్చినా ఇక్కడ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
పత్రికలతో సరిపెట్టుకోవాలి
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తమకు కావాల్సిన పుస్తకాలు దొరుకుతాయనే ఆశతో గ్రంథాలయానికి వస్తారు కానీ ఇక్కడి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. దినపత్రికలు, వార, మాస పత్రికలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. కనీస మౌలిక వసతులు కూడా లేవని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు గ్రంథాలయాల పైకప్పులు ఊడిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి.
17 గ్రంథాలయాలు..3 లైబ్రేరియన్లు
పదరా, ఊరుకొండ ,చారగొండ మండలాల్లో ఇంతవరకు శాఖా గ్రంథాలయాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలోని 17 గ్రంథాలయాలకు కలిపి ముగ్గురు మాత్రమే లైబ్రేరియన్లు ఉన్నారు. సిబ్బంది కూడా లేరు. పార్ట్ టైం వర్కర్లుగా తొమ్మిది మంది స్వీపర్లు, ఆరుగురు అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. వీరే స్వీపర్లు, అటెండర్లు, సెక్యూరిటీ గార్డులు, రికార్డ్ అసిస్టెంట్లు, కొన్ని చోట్ల లైబ్రేరియన్‌గా కూడా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి.
ఆల్ ఇన్ వన్
జిల్లా గ్రంథాలయంలో మొత్తం జిల్లా అధికారి, యూడీసీ, ఎల్డీసీ, కంప్యూటర్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, అటెండర్ ఇలా ఏడుగురు ఉద్యోగులుండాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక్క పార్ట్‌టైమ్ వర్కరే ఈ విధులన్నీ నిర్వర్తిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని గ్రంథాలయం ఓ భవనంలో రెండో అంతస్తులో ఉండటం వల్ల వృద్ధులు మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారు.
పరిష్కరించండి
ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపి జిల్లాలోని గ్రంథాలయాల్లో తిష్ట వేసిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మౌలిక వసతులు కల్పించి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : జలదిగ్బంధంలో హిందూపూర్