నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు రాకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 40 మంది గర్భిణులు ఉదయం నుంచి ఎదురుచూస్తూ... చేసేది లేక ఆపరేషన్ వార్డు వద్ద నిల్చున్నారు. కనీసం కూర్చోవడానికి కూడా వసతులు లేవని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా మరోవైపు ప్రసవ వేదనతో భయాందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సాకుతో వైద్యులు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని... ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. మధ్యాహ్నం సమయంలో విధులకు హాజరవుతన్నారని... ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పేద ప్రజలు ఆస్పత్రికి వస్తారని... వారికి వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇదీ చదవండి: మొండిగా ఉంటేనే.. మహమ్మారిని ఎదుర్కోగలం : కేసీఆర్