నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అడవుల్లో రెండు రోజులు కింద తప్పిపోయిన గొర్రెల కాపరి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పదర మండల కేంద్రానికి చెందిన బత్తుల బాలనారి(50) శుక్రవారం తన గొర్రెలను తాండూరు నుంచి పదరకు తీసుకెళ్లాడు. ఈ తరుణంలో మార్గ మధ్యలో సిద్ధాపూర్ అడవిలో మేతకు తీసుకెళ్లి గొర్రెలతో సహా తప్పిపోయాడు.
శనివారం రోజు అతని కుటుంబ సభ్యులు రోజంతా గాలించినా ఆచూకీ లభించలేదు. చేసేదేమీ లేక... పదర మండల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం సీఐ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా విడిపోయి వెతకగా… అమ్రాబాద్ మండలం జంగంరెడ్డి పల్లి సమీప అడవుల్లో ఓ చెట్టు కింద స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించాడు. బాలనారికి ప్రథమ చికిత్స అందించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా తప్పిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి: అన్నదాతల ఆందోళన.. భారీగా నిలిచిన వాహనాలు