Terrace Garden : కొవిడ్ తర్వాత మనిషి ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రకృతికి దూరంగా వెళ్లిన మనిషి... తిరిగి అదేవైపు అడుగులు వేస్తున్నాడు. రసాయనాలు వాడని కూరగాయలు, ఆక్సిజన్ అందించే మొక్కల పెంపకం సహా... టెర్రస్ గార్డెన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. యాంత్రిక జీవనంలో కాస్త వెసులుబాటు చేసుకుని మొక్కలను పెంచుతూ మనసు సాంత్వన పరచుకోవడమే కాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. మొక్కల ప్రాధాన్యాన్ని ఎరిగిన కొందరు ఆక్సిజన్ అందించే వాటిని ఇళ్లలో పెంచుకుంటున్నారు.
నాగర్‌కర్నూలు పట్టణంలోని పలువురు ఇళ్లలో గార్డెన్లు ఏర్పాటు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లోను, బాల్కనీలు, టెర్రస్‌లపై మొక్కలు పెంచుతున్నారు. రోజులో కొంత సమయం వాటి మధ్యన ఆహ్లాదంగా గడపడమే కాకుండా.. గృహావసరాలకు అవసరమైన కూరగాయలు, పండ్లను స్వయంగా పండించుకుంటున్నారు.
మా ఇంట్లో టెర్రస్‌పై పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నాను. ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా.. సాగు చేస్తున్నాము. ఇంటి అవసరాలకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నాం. రోజుకో గంట సమయం మొక్కల పెంపకానికి కేటాయిస్తాం. ఈ మొక్కల మధ్యకు వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. - మణికాంత్, టెర్రస్ గార్డెన్ పెంచుతున్న వ్యక్తి
నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లో టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకున్నాను. మా ఇంటిపై ఖాళీ ప్రదేశంలో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతున్నాము. ఇంట్లో అవసరాలకు మేము పండించుకున్నవి సరిపోతున్నవి. మమ్మల్ని చూసి మా చుట్టుపక్కల వాళ్లు కూడా మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కల మధ్యకు వస్తే ఎంత అలసట ఉన్నా ప్రశాంతత లభిస్తుంది. -రాధారాణి, గృహిణి
ఇదీ చూడండి: Plants Doctor: మొక్కలకు సుస్తి చేస్తే.. ఉన్నారు ఓ డాక్టరమ్మ..!
యూట్యూబ్ చూసి.. తమ ఇళ్లలో ఖాళీ స్థలాలను అందమైన గార్డెన్లుగా మలుచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో అందమైన ఆకృతిలో మొక్కలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బయట అడుగు పెడితే భయపడాల్సి వస్తున్న నేటి రోజుల్లో ఇంటికి వచ్చి ఓ గంటసేపు ఈ మొక్కల మధ్య గడపడం ఎంతో హాయిగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా ఇంట్లో సుమారు 339 రకాల మొక్కలు పెంచుతున్నాము. ప్రతి మొక్కకు ఓ ప్రాధాన్యత ఉంది. ఇంట్లో మొక్కలను చూస్తుంటే ప్రకృతే మా ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన గాలిని పొందడంతో పాటు శరీరానికి కావాల్సిన శ్రమ సాధ్యమవుతుంది. అందువల్ల చెట్లు పెంచండి. ప్రకృతిని ఆస్వాదించండి. -మొహమ్మద్ ఇసాక్, ప్రకృతి ప్రేమికుడు
చివరిగా ఒక్కమాట...
విరబూసిన పూలతో నిండిన మొక్కను చూస్తే.. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇట్టే ఉపసమనం లభిస్తుంది అనడంలో సందేహం ఉండదు. మొక్కకు మనిషికి ఉన్న బంధం.. ఆత్మసంబంధం వంటిది. అందుకే కలత చెందిన మనసును, కష్టాల్లో ఉన్న మనిషి గురించి చెప్పేటప్పుడు ఎండిన మానుతో పోల్చుతారు. ప్రకృతికి, మానవునికి మధ్యనున్న బంధాన్ని గుర్తించిన వారు వృక్షోరక్షతి రక్షితః అంటున్నారు. అందుకే వీలైతే మొక్కను పెంచండి.. అది ఎదుగుతుంటే మీ మనసు ఎంత ప్రశాంతత పొందుతుందో మీకే తెలుస్తుంది.
ఇదీ చూడండి: Traditional food items preparing shop : ఒకరి ఆలోచన.. తోటి వారికి ఉపాధిగా మారింది.. ఎలా అంటే...?