Staff Shortage in Kollapur Govt Hospital: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు.. 2022 జనవరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 50 పడకల ఆసుపత్రి ప్రారంభించారు. 24 గంటల సేవలందించే ఆసుపత్రికి నిత్యం 30 మంది ఓపీకి వస్తున్నారు. సగటున నెలకు 30 ప్రసవాలు జరుగుతాయి. 24 గంటల ఆసుపత్రి కావడంతో మూడు షిఫ్టుల్లో వైద్యులు, సిబ్బంది పని చేయాలి. కొల్లాపూర్ ఆసుపత్రిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
Kollapur MCH Problems: ఇద్దరు గైనకాలజిస్టులకు ఒక్కరే.. అదీ డిప్యూటేషన్‌పై సేవలందిస్తున్నారు. 18 మంది సిబ్బందికి 11 మందే పని చేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణ పేరుతో ఇతర ఆసుపత్రులకు పంపారు. పిల్లల వైద్యం కోసం ప్రభుత్వం అసలు వైద్యులనే కేటాయించలేదు. ముగ్గురు వైద్యులతోనే 24 గంటలు మూడు షిఫ్టులను అతి కష్టం మీద నెట్టుకొస్తున్నారు. నవ జాత శిశువుల్లో గుండె సంబంధిత లోపాలు గుర్తించడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవు.
ఆసుపత్రికి వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కనెక్షన్: కామెర్లను తగ్గించే ఫొటోథెరపీ లేదు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆక్సిజన్ సౌకర్యం లేదు. తల్లి ఉన్నచోటే పిల్లలకు సైతం అత్యవసర వైద్యం అందుబాటులో ఉంటే పిల్లల్ని పట్టుకుని జిల్లా ఆసుపత్రులకు తిరగాల్సిన అవసరం ఉండదు. అందుకే నవజాత శిశువులకు అత్యవసర వైద్య కేంద్రాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. ఆసుపత్రికి వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో.. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉండటం లేదు.
కొత్త లైన్ వేయాలంటే రూ.18 లక్షలు ఖర్చవుతాయని.. ఆసుపత్రికి ప్రత్యేక బడ్జెట్ ఏమీ మంజూరు చేయలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు వెల్లడించారు. ఇక శస్త్రచికిత్సల సమయంలో అవసరమయ్యే రక్తనిధి లేదు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకైనా ప్రాణాపాయం వస్తే నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. అంగట్లో అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. అవసరమైన భవనం, పరికరాలున్నా సిబ్బంది లేక అవస్థలు పడుతున్నారు. ఉన్న సిబ్బందిపై ఒత్తిడితో పాటు రోగులకు పూర్తి స్థాయి సేవలు అందక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి.
దీనిలో గైనకాలజిస్ట్లు ఇద్దరు ఉండాలి. ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే డిప్యూటేషన్ మీద అచ్చంపేట సెంటర్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మత్తు మందు వైద్య నిపుణులు ఇద్దరు ఉండాలి. కానీ, ఒక వేకెన్సీ ఉంది. ఒకరు నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రి నుంచి డిప్యూటేషన్ మీద ఉన్నారు. పిల్లల వైద్య నిపుణులు కూడా మన దగ్గర డిప్యూటేషన్ కింద వర్క్ చేస్తున్నారు. ఆసుపత్రులకు కరెంట్ 24 గంటలు సౌకర్యం ఉండాలి. ఇక్కడ 24 గంటల విద్యుత్ ఉండట్లేదు. విద్యుత్ కొరత చాలా ఉంది. -శ్రీనివాసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఇవీ చదవండి: