నాగర్కర్నూల్ జిల్లాలో తాడూరు, తిమ్మాజీపేట, బిజినాపల్లి మండలాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలను కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
రైతుబంధు పథకం ద్వారా రైతులకు డబ్బులు ఇచ్చే పథకాన్ని దేశంలోనే ఏ రాష్ట్రము ఇంతవరకు అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాబోయే కాలంలో హరిత తెలంగాణను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, అదనపు కలెక్టర్ల్ హనుమంత్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.