నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ అమలు తీరును ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి పరిశీలించారు. బస్‌స్టాండ్ దగ్గర లాక్‌డౌన్ ఏవిధంగా అమలవుతుందో పోలీసు అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఉదయం 6గంటలు నుంచి 10 వరకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపు అమలుతీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది.. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలని, లాక్‌డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే చేతికి గ్లౌజులు, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రజలను కోరారు. ఎలాంటి భయాందోళన చెందవద్దని, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
అనంతరం ప్రైవేటు సిటీ స్కాన్ యాజమాన్యంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పేద ప్రజల వద్ద సిటీ స్కాన్‌కు ఐదువేల రుసుమును వసూలు చేస్తున్నారని.. విపత్కర సమయంలో ఫీజులు తగ్గించాలని ఎమ్మెల్యే కోరారు. ఇకనుంచి 3,500 రూపాయలు మాత్రమే తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. అంతకుముందు తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఇదీ చూడండి: 'బీబీనగర్ ఎయిమ్స్‌ను కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలి'