నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండిచింతలపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 15 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఇంకా ప్రారంభించలేదు. దానిని నీటితో నింపగానే... పిల్లర్లు పెచ్చులు ఊడిపోయి ట్యాంక్ మొత్తం ఒకవైపుకు ఒరిగింది. గమనించిన స్థానికులు అప్రమత్తమై ట్యాంకులోని నీళ్లను ఖాళీ చేయించారు.
కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మాణం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రారంభం కాకముందే ట్యాంకు వంగిపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుతో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) సీఈ చిన్నారెడ్డి ట్యాంకును పరిశీలించారు. స్థానిక తెరాస నేతలు, అధికారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేపట్టారని జిల్లా డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ విమర్శించారు.
ఇదీ చూడండి: గాయత్రి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం