భూవివాదాలకు, అక్రమాలకు స్వస్తి పలికేందుకే ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని అమాత్యులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ప్రదర్శన సాగింది.
రైతు ప్రయోజనాల కోసం తెరాస ప్రభుత్వం కొత్త చట్టాలు తెస్తుంటే.. కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లుల్ని తీసుకొచ్చిందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు భాజపా.. వ్యవసాయ బిల్లుల్ని తెచ్చిందన్నారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా తెరాస పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఒప్పంద వ్యవసాయం పేరుతో వ్యవసాయ రంగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నూతన రెవిన్యూ చట్టంపై ప్రజల్లో మంచి స్పందన ఉందని... భవిష్యత్తులో అచ్చంపేట నియోజక వర్గంలో కేఎల్ఐ ద్వారా రెండు పంటలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం