గురువారం నాగర్‌కర్నూల్‌లో ఎంపీ రాములు అధ్యక్షతన నిర్వహించిన దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో లేని వారందరూ... వానాకాలంలో రెండున్నర నెలలు, యాసంగిలో రెండున్నర నెలలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని చేసుకొని ఉపాధి పొందవచ్చని తెలిపారు. హమాలీ పని... ఉపాధి కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా చదువుకున్న వారున్నారని... వారందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని మంత్రి పేర్కొన్నారు.
వానాకాలంలో రెండున్నర నెలలు, యాసంగిలో రెండున్నర నెలల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర హమాలీ పనిచేసుకునే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామానికి వచ్చింది. ఇంతకు మించి ఉపాధి ఏముంటుంది. ఇది ఉపాధి కాదా?. చదువుకుంటే సర్కారు ఉద్యోగం అంటున్నారు.. ఉద్యోగం రావాలంటే చదువుకోవాలి కానీ.. చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం. చదువు జ్ఞానానికి ఉపయోగపడుతుంది. అసలు విషయాలపై చర్చ, దృష్టి పెట్టకుండా కొందరు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నారు.
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
రానున్న పదేళ్లలో రాష్ట్రంలో, దేశంలో 10వ తరగతి చదవని వారంటూ ఉండరని.. అలాంటప్పుడు ఉపాధి అవకాశాలే చూసుకోవాలన్నారు. పక్క రాష్ట్రంలో పనిచేయనివారు.. మన రాష్ట్రంలోకి వచ్చి.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి మొసలి కన్నీళ్లతో యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉద్యోగులను తొలగించి ప్రైవేటుపరం చేస్తుంటే పట్టించుకోకుండా.. ఇక్కడి ఉద్యోగాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా తన వ్యాఖ్యలకు కొందరు విపరీత అర్థాలు తీశారని.. అలా వక్రీకరించడాన్ని, నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నానని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: flood prevention: రీఛార్జి వెల్స్ ఉత్తమమన్న జేఎన్‌టీయూ.. పట్టించుకోని బల్దియా..