ktr on congress: గత 65 ఏళ్లలో జరగని పనులు కేసీఆర్ హయాంలోనే జరిగాయని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు అధికారమిచ్చినా కరెంట్, పెన్షన్లు, మంచినీళ్లు, సాగునీరు, సరైన విద్యను అందించలేక పోయిందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసగించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని.. ఎవరెన్ని మాటలు చెప్పినా పట్టించుకోకుడదని విఙ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండని బతిమిలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కాలం చెల్లిన మందు లాంటిదని.. వారికి చరిత్ర మాత్రమే మిగిలిందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు డిపాజిట్‌లు గల్లంతు అవుతుందన్నారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ చావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అని.. అది తెలంగాణను ఉద్ధరిస్తదంటే ఎట్లా నమ్మాలని ఎద్దేవా చేశారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ వాళ్లకు చరిత్ర తప్ప భవిష్యత్ లేదు. చావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ వారిది. మీరు తెలంగాణను ఉద్ధరిస్తామంటే మేం ఎలా నమ్మాలా? దేశాన్ని రావణకాష్ఠంగా మార్చింది ఇప్పుడున్న భాజపా ప్రభుత్వం. విషం చిమ్మడం, విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేం లేదు. తెల్లారి లేస్తే ఒక మతాన్ని కించపరిచేలా చేయడం. ప్రధాని మోదీ ఇస్తానన్న పంద్రా లాఖ్ ఎక్కడ? కేంద్రంలో ఉన్నది అసమర్థ ప్రభుత్వం. అందువల్లే సిలిండర్, ఇంధన ధరలు పెరిగాయి. - కేటీఆర్, ఐటీశాఖ మంత్రి
అనాలోచిత విధానాలతో, అస్తవ్యస్థమైన ఆలోచనలతో ఈ దేశం పట్ల, వాస్తవిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా దేశాన్నే రావణకాష్ఠంగా భాజపా మార్చిందన్నారు. మాట్లాడితే విషం చిమ్మడం, విద్వేషం మాటలు మాట్లడం తప్పా ఆలోచనతో అర్థవంతమైన మాటలు, భారతదేశాన్ని నడిపించే స్థితిలో భాజపా లేదన్నారు. కరోనా నేపథ్యంలో మూడేళ్ల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదని.. ఈ ఆగష్టు నెల నుంచి ఇంటింటికి తిరిగి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కొల్లాపూర్ పట్టణంలో భూమి కేటాయిస్తే ఆహార శుద్ధి పరిశ్రమలను తీసుకొచ్చే చర్యలు చేపడుతామని కేటీఆర్ తెలిపారు. ఉద్యానవన పాలిటెక్నిక్‌ను మంజూరు చేస్తామని, 98 జీవో ప్రకారం లష్కర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అమరగిరిలోను ఎకో టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆదేశించారు. పింఛనర్లను 29 లక్షల నుంచి 40 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. గురుకులాల ద్వారా 5 లక్షల మందికి విద్య అందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన: నాగర్ కర్నూల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ రూ.392.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.1.20 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్, రూ.2 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి రూ.17 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్‌పై భారీ జాతీయజెండా ఆవిష్కరించారు.
నాగర్‌కర్నూల్‌లో నిర్మించిన కొత్త మున్సిపల్ కార్యాలయం, రూ.35 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, రూ.28 కోట్లతో నిర్మించిన సీసీ రహదారులను మంత్రి ప్రారంభించారు. పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద రూ.5 కోట్ల టౌన్ మీటింగ్ హాల్‌కు భూమిపూజ చేశారు. అనంతరం రూ.7 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న కూరగాయల మార్కెట్, రూ.4.50 కోట్ల నాన్ వెజ్ మార్కెట్, రూ.6 కోట్లతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహ భవనానికి శంతుస్థాపన చేశారు. మొత్తం రూ.114.50 కోట్ల అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేసిన మంత్రి.. మొత్తం రూ.233.65 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. దాదాపు రూ.44.25 కోట్ల ఆర్‌అండ్‌బీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: